
తెలంగాణలో కృష్ణానదిపై పది సంవత్సరాల క్రితం చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టులు గత ప్రభుత్వ ఉదాసీనత వలన నత్తనడకన నడుస్తున్నాయి. పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి చేస్తారని ఆశతో ఎదురుచూస్తున్న కరువుసీమ జిల్లాలైన మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా ప్రజలకు నిరాశే కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు నిరందించాల్చిన భీమా, నెట్టంపాడు, కల్వకుర్తి లిఫ్ట్ పనులు ఇంకా 20 శాతం పూర్తి కావలసి ఉంది. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాకు చెందిన ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతలు సమీక్షలకే పరిమితమైనవి. ఈ ప్రాజెక్టును స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాత్రం మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తామని ప్రకటనలు మాత్రం గుప్పిస్తున్నారు. కానీ, ఈ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపించుటలేదు. పూర్తిగా భూసేకరణ, భూములు కోల్పోతున్న లబ్ధిదారులకు నష్టపరిహారం అందించటం, పర్యావరణ అనుమతులు పొందటంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది.
పాలమూరు ఎత్తిపోతల పథకం
జూరాల ప్రాజెక్టు ముందు భాగం నుంచి ఎత్తి పోతలతో 7 లక్షల ఎకరాలు(38 మండలాలు) మహబూబ్ నగర్ జిల్లా, 3 లక్షల ఎకరాలు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు అందించాలని అంచనా వ్యయం రూ.16.5 వేలకోట్లతో మహబూబ్‌నగర్ జిల్లాకు సాగు, తాగునీరు అందించాలని 2013లో పథకాన్ని రూపొందించి.. ఎన్నికల ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి అనుమతిస్తూ జీఓ జారీచేసి శంకుస్థాపన చేశారు. ఈ స్కీంతో జూరాల నుంచి వరదలు వస్తున్నప్పుడు ఎక్కువ నీటిని గ్రావిటీ ద్వారా తరలించుకునే అవకాశం ఉండేదని నేటికీ కొంతమంది నిపుణులు చెపుతున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల రూపకల్పన
2014లో అధికారంలోనికి వచ్చిన కేసీఆర్, బీఅర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని 'పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల' పథకం రీడిజైన్ చేసి శ్రీశైలం లోతట్టు నుంచి రోజు 1.5 టీఎంసీలు 60 రోజులలో 90 టీఎంసీలు ఎత్తిపోతల ద్వారా 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 గ్రామాలకు తాగునీటిని అందించేవిధంగా రూ.32.5 వేల కోట్ల అంచనాలతో రూపొందించారు. 2015లో కేసీఆర్ శంకుస్థాపన చేస్తూ 4 సంవత్సరాలలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇది కృష్ణా అదనపు జలాలపై చేపడుతున్న ప్రాజెక్టు. దీనిపై పక్క రాష్ట్రం ఒత్తిడి కూడా ఉంటుంది. కానీ, ఈ ప్రాజెక్టుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా గత బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది.
రెండు దశలలో చేపట్టాలని నిర్ణయం
మొదటి దశలలో ఆరు రిజర్వాయర్లు, అన్ని పంపు హౌస్‌లు పూర్తి చేయాలనే నిర్ణయం. అందులో భాగంగా మొదటి విడతలో నార్లాపూర్ పంప్ హౌస్ లో 9 మోటార్లు ఉండగా, మూడు మోటార్ల డెలివరీ పాయింట్లు పనులు పూర్తియైనవి. ఏదుల, వట్టెం, కరివేన రిజర్వాయర్ల పనులు 60శాతం వరకు, ఉద్దండపూర్‌లో మాత్రం ఇంకా కొన్ని పనులు మొదలు కాలేదు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరును పక్కకు పెట్టారు. మొత్తం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేందుకు 34 మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. వట్టెం దగ్గర కూడా 4 మోటార్లు సిద్ధమయ్యాయి. సబ్ స్టేషనులో పనులు మొదలుపెట్టాలి. రెండోదశలో ప్రాజెక్టులోని కాలువల నిర్మాణం ఉంటుంది. ఆ కాలువల నిర్మాణం పూర్తయితేనే వాస్తవంగా సాగునీరు అందుతుంది.
నిలిచిపోయిన రిజర్వాయర్ల నిర్మాణ పనులు
రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజులలో నీటిని ఎత్తిపోయుటకు, 90 టీఎంసీల నీటిని నిల్వ చేయుటకు ఐదుచోట్ల పంప్ హౌస్‌లు నిర్మించాలి. దీనికోసం చేపడుతున్న ఆరు రిజర్వాయర్లు నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ ఆరు జలాశయాలు కలిపి 67.74 టీఎంసీల వరకు నీటిని నిలువ చేసుకోవాలి. నీటిని ఎత్తడం కోసం అన్ని పంపు హౌస్‌ల్లో కలిపి 34 మోటర్లు ఒక్కొక్కటి 145 మెగావాట్ల సామర్థ్యం, మూడు 75 మెగావాట్ల సామర్థ్యంతో ఉంటాయి. ఈ మోటార్లు కాళేశ్వరంలో వాడిన వాటికంటే పెద్దవని చెప్పవచ్చు. ప్రాజెక్టులో భాగంగా 61.57 కిలోమీటర్ల మేర సొరంగాలు,915.47 కిలోమీటర్ల పొడవైన కాలువలు ఉంటాయి. దీంతో ఎత్తిపోతల పథకంలో తాగునీటికి 7.15 టీఎంసీలు, పరిశ్రమలకు 4 టీఎంసీలు, సాగునీటికి 75.94 టీఎంసీలు వాడుకోవాల్సి వస్తుంది. సీఎం రేవంత్, రాష్ట్ర నీటిశాఖ మంత్రి ఉత్తమ్..కృష్ణా జలాలపై చేపట్టిన ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యతనివ్వాలి. మాటలు కాదు చేతలతో, కార్యాచరణతో కనీసం ఈ మూడు సంవత్సరాలలో పూర్తి చేయాలి.
కాంగ్రెస్‌పై ఆశలు పెంచుకున్న పాలమూరు ప్రజలు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయని పాలమూరు ప్రజల్లో, రైతుల్లో ఆశలు రేకెత్తాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోపాటు, ఇద్దరు మంత్రులు కేబినెట్లో ఉండడంతో ఇక్కడి రైతుల కళ్లల్లో ఆనందం తొణికిసలాడింది. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటివరకు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నట్లు లేదు. పనులలో పురోగతి కనిపించుట లేదు. ఆగిపోయిన పనులకు నిధులు విడుదల చేస్తూ వేగంగా పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పనులు పూర్తికాకున్నా ప్రారంభోత్సవం
2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హడావుడిగా పనులు పూర్తి కాకముందే నార్లాపూర్ వద్ద ఒక్క మోటారు ఆన్ చేసి రిజర్వాయరులోనికి నీరు నింపి.. ప్రాజెక్టు అంతా పూర్తిచేసినట్లు వ్యవహరించారు. అదే రోజు పనులు కాలేదని అధికారులు మోటారు బంద్ చేశారు. నేటికీ 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్న చందంగా ఉంది.
ఉజ్జిని రత్నాకర్ రావు, సీపీఐ సీనియర్ నేత