ఇందిరా డెయిరీని సక్సెస్​ చేయాలి : భట్టి విక్రమార్క

ఇందిరా డెయిరీని సక్సెస్​ చేయాలి : భట్టి విక్రమార్క
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మధిర, వెలుగు : మధిర నియోజకవర్గంలో గొప్ప మహోన్నత ఆశయంతో చేపట్టిన కార్యక్రమం ఇందిరా డెయిరీ అని, అధికారులు మనస్ఫూర్తిగా పనిచేసి సక్సెస్​ చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం మధిర క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, డీఆర్డీవో, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇందిరా డెయిరీ పథకంలో ప్రతీ లబ్ధిదారుడికి రెండు గేదెలు అందజేయాలని, సభ్యులు ఎటువంటి కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. 

సభ్యులకు భూమి ఉండాలన్న నిబంధన ఏదీ లేదని, అసలు గేదెలు లేనివారికి ఈ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. రానున్న ఐదు నెలల లోపు నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఇందిరా డెయిరీ పథకం ప్రారంభం కావాలన్నారు. పనులు వేగవంతం చేసేందుకు గేదెల కొనుగోలుకు పెద్ద సంఖ్యలో అధికారుల బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. గేదెలకు అవసరమైన పచ్చి గడ్డి, ఎండు గడ్డి వివరాలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో డీఆర్డీవో సన్యాసయ్య, డీపీవో ఆశాలత, డీటీడబ్ల్యూవో విజయలక్ష్మి, ఎల్డీఎం శ్రీనివాస రెడ్డి, డీవీహెచ్ వో శ్రీనివాస రావు, డీఏవో పుల్లయ్య, డీబీసీడీవో జ్యోతి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ నవీన్ బాబు పాల్గొన్నారు.