
- స్టూడెంట్స్, పేరెంట్స్‌ను పిలిపించి మ్యాపింగ్ స్కూల్‌కు వెళ్లాలని సూచన
- సిర్పూర్ (టి) సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్ల దీన స్థితి
కాగజ్ నగర్, వెలుగు: శిథిలావస్థలో ఉన్న సిర్పూర్(టి) మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్‌కు ఇప్పటికే రెయిన్ హాలిడేస్ ప్రకటించిన అధికారులు.. తాజాగా స్కూల్లోని విద్యార్థులందరినీ ఇతర రెసిడెన్షియల్స్‌లో సర్దుబాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్కూల్ బిల్డింగ్, హాస్టల్, డార్మెటరీ భవనాలు శిథిలావస్థకు చేరాయి. బిల్డింగ్ పైకప్పు పెచ్చులు ఊడుతుండటం, వర్షం నీరు క్లాస్‌రూములు ఉరుస్తుండడంతో స్టూడెంట్లను మరో బిల్డింగ్‌లోకి మార్చాలని అధికారులు అదేశాలిచ్చారు. ముందు జాగ్రత్తగా గత నెల 29న స్కూల్ లోని మొత్తం 497 మంది స్టూడెంట్లకు హాలిడేస్ ప్రకటించారు. గురుకులాల సెక్రెటరీ నుంచి ఆదేశాల మేరకు స్టూడెంట్లను ఇతర రెసిడెన్షియల్స్‌లో అడ్జస్ట్ చేస్తున్నారు.
తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో సోమవారం ఉదయం నుంచి పిల్లలను వెంటబెట్టుకుని తల్లిదండ్రులు సిర్పూర్ రెసిడెన్షియల్‌కు వచ్చారు. 5, 6, 7 తరగతుల స్టూడెంట్స్ 229 మందిని ఆసిఫాబాద్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (బాయ్స్) లో మ్యాపింగ్ చేయగా, 8వ తరగతి స్టూడెంట్స్ 66 మందిని మంచిర్యాల జిల్లా జైపూర్ బాయ్స్ రెసిడెన్షియల్ కాలేజీలో, 9,10వ తరగతి 141 మంది విద్యార్థులను బెల్లంపల్లి సీఓఈలో మ్యాపింగ్ చేశారు.
ఇంటర్ సీఈసీ గ్రూప్ స్టూడెంట్స్ 47 మందిని కాసిపేట్ రెసిడెన్షియల్‌కు, ఎంఈసీ స్టూడెంట్లు 14 మందిని కోరుట్లలోని రెసిడెన్షియల్ లోకి తాత్కాలికంగా సర్దుబాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. టీచింగ్ స్టాఫ్‌ను సైతం ఆయా స్కూళ్లలో విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ భవనాన్ని వెతకాలని ప్రిన్సిపాల్ శ్రీనివాసరావును ఆదేశించారు. అయితే చదువు మధ్యలో వేరే స్కూళ్లలకు వెల్లడంపై పిల్లలు, వారి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.