డెవిల్ సినిమా నాది..క్రెడిట్‌ ఇవ్వకపోవడం బాధించింది: డైరెక్టర్ నవీన్ మేడారం

డెవిల్ సినిమా నాది..క్రెడిట్‌ ఇవ్వకపోవడం బాధించింది:  డైరెక్టర్ నవీన్ మేడారం

కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా నటించిన డెవిల్(Devil) మూవీ మరో రెండ్రోజుల్లో డిసెంబర్ 29న థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఇపుడు ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం డెవిల్ సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ లో దర్శకుడి పేరు లేకపోవడమే.అదేంటీ డైరెక్టర్ పేరు లేకుండా..సినిమా ఎలా చేస్తారని అనుమానం వస్తోంది. ఇన్నాళ్లు అందరి దృష్టిలో మెదిలే ప్రశ్న ఇది.

 

 

వివరాల్లోకి వెళితే.. 

డెవిల్ సినిమాను నిర్మిస్తుంది అభిషేక్ పిక్చర్స్. ముందుగా ఈ సినిమాకు కథ, కథనం శ్రీకాంత్ విస్సా(Srikanth Vissa) అని, డైరెక్షన్ నవీన్ మేడారం(Naveen Medaram) అని వేశారు మేకర్స్. ఆ తరువాత కథనం, డైరెక్షన్ నవీన్ మేడారం, కేవలం కథ మాత్రం శ్రీకాంత్ విస్సా అని వేశారు. ఇక ఉన్నట్టుండి వచ్చే అప్డేట్స్ లో ఏ ఫిల్మ్ బై అభిషేక్ నామా(Abhishek Nama) అని వేస్తూ వస్తున్నారు. దీంతో ఈ సినిమా నుండి దర్శకుడు నవీన్ మేడారం తప్పుకున్నాడు అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే తనకు తానుగా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడా? లేక కావాలనే అతనిని తప్పించారా అనే విషయం సస్పెన్స్ గానే ఉంది.

డైరెక్టర్ నవీన్ మేడారం ఎమోషనల్ నోట్:

కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాను తీయడానికి మూడేళ్లు శ్రమించానని..స్క్రిప్ట్ తయారు చేయడం నుంచి స్క్రీన్ ప్లే, కాస్ట్యూమ్స్, లొకేషన్లు, సెట్స్..ఇలా ప్రతిదాంట్లో నా ఆర్టిస్టిక్ విజన్ ఈ సినిమాలో కనిపిస్తుందని ఎమోషనల్ నోట్ పంచుకున్నాడు. ఈ సినిమాను తెరకెక్కించడానికి ఇండియా వైడ్గా చాలా ప్రదేశాల్లో తిరిగి రీసర్చ్ చేశానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా, కరైకూడి, వైజాగ్, హైదరాబాద్ లలో 105 రోజుల పాటు సినిమాని ప్రాణం పెట్టి చిత్రీకరించాను. ఇది నాకు ఓ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, నా కన్న బిడ్డ.ఎవరు ఏమన్నా సరే ఎప్పటికైనా..డెవిల్ ఫిల్మ్ బై నవీన్ మేడారం అంతే" అని అతడు ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు.

అయితే..డెవిల్ సినిమా విషయంలో తాను ఏ తప్పూ చేయలేదని, ఇంతటి వివాదానికి కారణం అహంకారం, అత్యాశతో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలే కారణమని ఈ లేఖ ద్వారా స్పష్టం చేశాడు. డెవిల్ సినిమా పూర్తి క్రెడిట్స్ లో తన పేరు ఎక్కడ లేకపోవడం..ఇన్నాళ్లు కష్టపడి తెరకెక్కించిన సినిమాలో..నా పేరు చూసుకోక పోవడం..చాలా బాధగా ఉందని..డైరెక్టర్ నవీన్ తెలిపారు. .

ఇక చివర్లో..హీరో కల్యాణ్ రామ్ గురుంచి చెబుతూ..ఈ సినిమా కోసం తన 100 శాతం అలుపెరుగని పర్ఫార్మెన్స్ ఇచ్చాడని, తనకు నేనేంటో తెలుసని వివరించారు. ఇక నా డెవిల్ సినిమాను డిసెంబర్ 29న అందరూ థియేటర్లకు వెళ్లి చూడాలని కోరాడు. డెవిల్ సినిమా నా జీవితానికి అందిన అమూల్యమైన అనుభవం, నైపుణ్యం. ఈ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తనతోనే ఎప్పటికైనా ఉంటాయని నవీన్ మేడారం ఇంస్టాగ్రామ్ ద్వారా నోట్ రిలీజ్ చేశాడు.