దసరా పండుగ: బొమ్మల కొలువు..సంప్రదాయాలకు నెలవు

దసరా పండుగ: బొమ్మల కొలువు..సంప్రదాయాలకు నెలవు

దసరా పండుగ వచ్చింది - సరదాలెన్నో తెచ్చింది.. అంటూ పల్లెల్లో పాటలు పాడుకుంటూ..  ఆనందం, ఉత్సాహాల మధ్య దసరా 'బొమ్మల కొలువు' ఆడపిల్ల ఉన్న ప్రతీ ఇంటా కొలువు తీరింది. దసరా నవరాత్రులలో పది రోజుల పాటు బతుకమ్మ ఆటపాటలకు తోడు బొమ్మలకొలువు పండగ జరుపుకుంటారు. ప్రతి రోజూ సాయంత్రము పేరంటానికి ముత్తైదువులను, పిల్లలను పిలిచి, అందరికీ తాంబూలము, దక్షిణ ఇవ్వడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.

బొమ్మల కొలువు ప్రారంభించిన సంవత్సరం ఒక వరుస బొమ్మలతో మొదలై ప్రతీ సారి ఒకటి చొప్పున తొమ్మిది మెట్ల వరకు పెంచుతూ వెళతారు. ప్రతీ సంవత్సరము తప్పనిసరిగా ఓ క్రొత్త బొమ్మ కొనడం సంప్రదాయం. అలాగే వచ్చిన వారు కూడా ఒక కొత్త బొమ్మను బహుకరిస్తారు. బొమ్మల కొలువులో ప్లాస్టిక్ బొమ్మలు, బార్బీలు.. వంటివి కాకుండా మట్టి బొమ్మలు, కొయ్య బొమ్మలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి.
 
సంస్కృతి సంప్రదాయాలు, నీతి కథలు, పురాణ గాథలు, ఇతిహాసాలు పిల్లలకు బోధపడేలా బొమ్మల కొలువును తీర్చిదిద్దుకోవాలి. దేవుని బొమ్మల్లో వినాయకుడు, సీతారాములు, రాధాకృష్ణులు, లక్ష్మిదేవి, సరస్వతిదేవి, పార్వతిదేవి.. పెట్టుకోవచ్చు. ఇక పెళ్ళితంతు బొమ్మలు, హాస్యబొమ్మలు, బామ్మ-తాత, గోపికలు, వివిధ జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్లు, చెట్ల బొమ్మలు,  ప్రయాణ సాధనాలు వంటివి కొలువులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ALSO READ : తెలంగాణ ప్రత్యేకం : దసరాతో మొదలయ్యే ఈ బులాయి పండుగ

తెలుగింటి సంబరాల సమాహారం దసరా. పండుగ అంటే దేవీ నవరాత్రులు... అమ్మవారి అలంకరణలు మాత్రమే కాదు. చూడచక్కని బొమ్మలు. ఆ సందర్భంగా జరిగే పేరంటాలు కూడా. దసరా నవరాత్రుల్లో చల్లని సాయంత్రాన బొమ్మల కొలువులకు వెళ్లడం మహిళలకు ప్రత్యేక అనుభూతి. బొమ్మల కొలువు అంటే చిన్న, పెద్ద అందరికీ పండుగే. రంగురంగుల బొమ్మలను చూడటం పిల్లలకు ఎనలేని ఆనందాన్ని ఇస్తే వాటిని ఓ క్రమపద్ధతిలో అందంగా అమర్చడం పెద్దవాళ్లకూ అంతు లేని ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే ఈ వేడుకలో ఇంటిల్లిపాది భాగస్వాములే. కొత్తగా వచ్చిన అపార్ట్‌మెంట్‌ కల్చర్‌లోనూ ఇవి సామాజిక వేడుకల్లా మారాయి.