తెలంగాణ ప్రత్యేకం : దసరాతో మొదలయ్యే ఈ బులాయి పండుగ

తెలంగాణ ప్రత్యేకం : దసరాతో మొదలయ్యే ఈ బులాయి పండుగ

ప్రత్యేకంగా గుడి లేదు. దేవుళ్లు, దేవతల విగ్రహాలు కూడా లేవు. మట్టితో చేసిన ప్రతిమనే దేవతగా కొలుస్తారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అదే “బులాయి” పండుగ ప్రత్యేకత. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని చాలా గ్రామాల్లో “బులాయి” (దేవత) ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పండుగ పదకొండు రోజులు పూజలు చేస్తే కోరిన కోర్కెలన్నీ తీరతాయని, గ్రామం చల్లగా ఉంటుందని నమ్ముతారు గ్రామస్తులు.

పదకొండు నుంచి పదిహేను రోజుల పాటు జరుపుకునే బులాయి వేడుకలు దసరా పండుగ రోజు మొదలవుతాయి. ఈ జాతరకి వారం పదిరోజుల ముందే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జెండా గూడా, జన్కాపూర్, కపూర్, బాబాపూర్, వాంకిడి, సరాండి, తదితర గ్రామాలు అందంగా ముస్తాబవుతాయి. ఈ వేడుకల్ని చూడ్డానికి తెలంగాణలోని ఇతర గ్రామాల నుంచి జనాలు వస్తుంటారు ఈ ఊళ్లకి. బంధువులు ఒకట్రెండు రోజుల ముందే చేరుకుంటారు. అంతా కలిసి పాటలు పాడుతూ... డాన్స్ లు చేస్తూ బులాయికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పండుగలో రోకలి బండ స్పెషల్ అట్రాక్షన్.

Also Read :- బాసర శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు

రోకలిబండకి పూజలు చేస్తారు.

బులాయి పండుగలో రోలుకి చాలా ప్రాముఖ్యత ఉంది. దసరా రోజు ఆడపడుచులంతా. రోకలి బండకి పూజలు చేస్తారు. ఐదుగురు ముత్తయిదువులు రోకలి బండకి పసుపు, కుంకుమ రాస్తారు. కంకణం కట్టి దానితో నేలమీద గట్టిగా కొడతారు. అలా కొట్టడం వల్ల నేలమీద గుండ్రంగా అవుతుంది. అక్కడ దీపం వెలిగిస్తారు.

చుట్టూ ఆవు పేడతో అలుకు చల్లి, ముగ్గులు వేస్తారు. దసరా పండుగకి ఐదు రోజుల తర్వాత బాజా భజంత్రీలతో దగ్గర్లోని వాగుకు వెళ్లి ఎర్రమట్టిని తీసుకొస్తారు ఆడవాళ్లు. ఆ ఎర్రమట్టితో గ్రామస్తులంతా కలిసి బులాయి ప్రతిమని తయారు చేస్తారు. 

బులాయి మెడలో వెండి గొలుసు వేసి, రోకలి బండతో చేసిన గుండ్రం దగ్గర ప్రతిష్టిస్తారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అక్కడ అలుకు చల్లి, ముగ్గులు పెడతారు. అప్పలు, గారెలు, సీతాఫలాలు, నిమ్మకాయలు, జొన్నకర్రలు బదైదు చొప్పున అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. 

నైవేద్యంగా..

ప్రతిష్ఠాపన జరిగిన తర్వాత కొందరు ఏడు, తొమ్మిది, పదకొండు రోజులు ఈ పండుగ చేసుకుంటారు. చివరి రోజు ఆడవాళ్లంతా బులాయి చుట్టూ ఆడి పాడతారు. రాత్రంతా పాటలు పాడి, డాన్స్ లు చేసి మరుసటి రోజు ఉదయం గ్రామస్తులంతా కలిసి బులాయిని బాజా భజంత్రీలతో ఒక పచ్చని చెట్టు దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ పిండి వంటలతో నైవేద్యం పెట్టి, పూలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఊరికి బులాయి అండగా ఉంటుందని నమ్ముతారు. - మసాదే సంతోష్ కుమార్, ఆసిఫాబాద్, వెలుగు

ఆచారంగా వస్తోంది

మా తాతల కాలం నుంచే గ్రామంలో బులాయి పండుగ జరుపుకుంటున్నం. ఈ పండుగ చేసుకుంటే ఊరిలోకి ఏ కష్టం రాదు. అందరూ ఆరోగ్యంగా ఉంటారు. పాడిపంటలు బాగుంటాయని మా నమ్మకం. అందుకే ప్రతి ఏటా ఘనంగా ఈ పండుగ జరుపుకుంటాం. మా పిల్లలకీ ఈ పండుగ ఆచార వ్యవహారాలు నేర్పిస్తున్నాం. -కాట్ కార్ రంజిత్

ఇంటి ఆడపడుచు

బులాయిని మా ఇంటి ఆడ పడుచులాగే చూసుకుంటాం. ఈ పండుగ జరిగే పదకొండు రోజులు ఉదయం, సాయంత్రం బులాయి చుట్టూ అలుకు చల్లి. ముగ్గులు పెడతాం. రాత్రిళ్లు బులాయి చుట్టూ ఆడిపాడతాం. బులాయి దేవతను కొలిస్తే పిల్లలు కలుగుతారని మా నమ్మకం. 
- యం.ప్రవీణ