పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయం

పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయం
  •      ఘనంగా పోలీస్​ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
  •     పోలీస్​ అమరవీరులకు ఘన నివాళి
  •     పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు

ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీం ఆసిఫాబాద్,  మంచిర్యాల, కోల్​బెల్ట్, బెల్లంపల్లి, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని హెడ్​క్వార్టర్స్​తోపాటు పోలీస్​స్టేషన్లలో పోలీస్​అమరవీరుల స్తూపాలకు పాలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదిలాబాద్​జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్‌ క్వార్టర్స్‌ ప్రాంగణంలోని అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావుతోపాటు ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అనంతరం సాయుధ పోలీసులు సెల్యూట్‌తో అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. రెండు నిమిషాల మౌనం పాటించి అమరవీరుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు. 

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్​లో సీపీ అంబర్ కిషోర్ ఝాతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. నిర్మల్​ జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరవీరుల స్మారక స్తూపానికి ఎస్పీ జానకి, పోలీస్​అధికారులు నివాళులర్పించారు. మందమర్రి పోలీస్ స్టేషన్​ఆవరణలోని అమరవీరుల స్తూపానికి ఏసీపీ రవికుమార్, బెల్లంపల్లి డివిజన్​పరిధిలోని పోలీస్ ఆఫీసర్లు నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. 

బెల్లంపల్లి ఏఆర్ హెడ్​క్వార్టర్స్​లో పోలీస్ అమరవీరుల స్తూపానికి ఏసీపీ ఎ. రవికుమార్, పోలీసులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పోలీసుల అమర వీరుల సేవలు చిరస్మరణీయమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులను స్మరించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పోలీసులు, అమరవీరుల కుటుంబాలు పాల్గొన్నాయి.