
న్యూఢిల్లీ: గురుగ్రామ్ వద్ద 40 ఎకరాల స్థలాన్ని ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ నుంచి ఎలన్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ డీల్విలువ రూ. 580 కోట్లు. హౌసింగ్, కమర్షియల్ ప్రాజెక్టులను ఈ స్థలంలో చేపట్టనున్నట్లు ఎలన్ గ్రూప్ వెల్లడించింది. ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవే దగ్గర ఈ స్థలం ఉంది. 50 లక్షల చదరపు అడుగులలో నిర్మాణానికి ఈ స్థలంలో వీలుంటుందని ఎలన్ గ్రూప్ వెల్లడించింది. ఇప్పటికే మూడు కమర్షియల్ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఎలన్ గ్రూప్ మరో అయిదు కమర్షియల్ ప్రాజెక్టులనూ అమలు చేస్తోంది. మొత్తం 40 ఎకరాలలో 30 ఎకరాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులను, మిగిలిన 10 ఎకరాలలో కమర్షియల్ ప్రాజెక్టులనూ ఎలన్ గ్రూప్ చేపడుతుంది. ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్‌కు ఇప్పటికే ఎలన్ గ్రూప్ అడ్వాన్స్ చెల్లించిందని, రాబోయే నెలల్లో డీల్ పూర్తవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.