పడిపోతున్న ఫోర్ట్‌నైట్ క్రేజ్ : 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్న 'ఎపిక్ గేమ్స్'!

పడిపోతున్న ఫోర్ట్‌నైట్ క్రేజ్ : 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్న 'ఎపిక్ గేమ్స్'!

ప్రముఖ బ్యాటిల్ గేమ్ 'ఫోర్ట్‌నైట్'కు  ఆదరణ తగ్గడం,  ఆదాయం పడిపోవడంతో ఖర్చులు తగ్గించుకోవడానికి ఎపిక్ గేమ్స్ సంస్థ 1,000 మందికి పైగా ఉద్యోగులను  తొలగించనుంది. ఈ ఏడాది గేమింగ్ ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఉద్యోగ కోతలలో ఇది ఒకటి. పెద్ద పెద్ద గేమ్స్ ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నా, కంపెనీలపై ఒత్తిడి మాత్రం తగ్గడం లేదని దీని ద్వారా తెలుస్తోంది.

2025లో ఫోర్ట్‌నైట్ ఆడేవారి సంఖ్య తగ్గడం వల్ల కంపెనీకి వస్తున్న ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేస్తోంది అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ స్వీనీ ఉద్యోగులకు  తెలిపారు.

"ఈ ఉద్యోగాల కోత... భవిష్యత్తులో కంపెనీని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది," అని  చెప్పారు. కాంట్రాక్టులు, మార్కెటింగ్, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ వంటి వాటిని ఆపడం ద్వారా కంపెనీ దాదాపు 500 మిలియన్ డాలర్లకు పైగా ఆదా చేసిందని ఆయన వెల్లడించారు.

ఫోర్ట్‌నైట్ ఇప్పటికీ ప్రపంచంలోని పాపులర్ గేమ్‌లలో ఒకటిగా ఉన్నా, అన్ని సీజన్‌లలో గేమ్ ఆడేవాళ్ళ  ఆసక్తిని అలాగే నిలబెట్టుకోవడం కంపెనీకి కష్టంగా మారింది. ఫోర్ట్‌నైట్‌ను మొబైల్‌లో మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడం, గేమ్ పర్ఫార్మెన్స్  మెరుగుపరచడం వంటి పనుల్లో కంపెనీ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని స్వీనీ తెలిపారు.

ఈ ఉద్యోగ కోతలు మొత్తం గేమింగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా సూచిస్తున్నాయి. కరోనా సమయంలో వచ్చినంత వృద్ధి ఇప్పుడు లేకపోవడం, కొత్త గేమ్స్ తయారీ ఖర్చులు పెరగడం వంటి సమస్యలను గేమ్ డెవలపర్లు ఎదుర్కొంటున్నారు. 2024 నుండి, పెద్ద కంపెనీల నుండి చిన్న వాటి వరకు అన్ని చోట్లా ఉద్యోగాల కోతలు జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారికి కంపెనీ కనీసం నాలుగు నెలల వేతనం ఇస్తుంది. దాంతో పాటు పనిచేసిన కాలాన్ని బట్టి అదనపు పరిహారం కూడా లభిస్తుంది. ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కూడా మరో ఆరు నెలల వరకు ఇవ్వనున్నారు.

ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్‌లు త్వరగా వచ్చేలా కంపెనీ చూస్తుంది. దీనివల్ల ఉద్యోగులు జనవరి 2027 నాటికి వారి షేర్లను పూర్తిగా సొంతం చేసుకోగలరు. అలాగే కంపెనీని విడిచిపెట్టిన తర్వాత కూడా వాటిని వాడుకోవడానికి గడువును రెండు సంవత్సరాల వరకు పెంచింది. పరిశ్రమలో ఉన్న ఒత్తిళ్లు, పోటీ మార్కెట్‌లో ఖర్చులు మేనేజ్ చేస్తూ కొత్తవి కనిపెట్టాల్సిన అవసరం వంటి సమస్యల వల్లే ఈ ఉద్యోగ తొలగింపులు జరిగాయని స్వీనీ చెప్పారు.

ఆర్థికంగా స్థిరపడటానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నప్పటికీ, కొత్త ప్లాట్‌ఫారమ్‌లు, డెవలపర్ల నెట్‌వర్క్ వంటి ప్రాజెక్టులపై ఎపిక్ గేమ్స్  పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉంది. గేమింగ్ పరిశ్రమకు సంబంధించి, ఈ కోతలు ఒక మార్పును సూచిస్తున్నాయి. కంపెనీలు ఏదో రకంగా ఎదగడం అనే ఆలోచన నుండి బయటకు వచ్చి, లాభాలు, నిర్వహణ వైపు మళ్లుతున్నాయి.