కేసీఆర్​కు నియ్యత్​ లేదు

కేసీఆర్​కు నియ్యత్​ లేదు
  • మీకసలు పాలించే అర్హతే లేదు: ఈటల రాజేందర్
  • రోషమున్న బిడ్డను కాబట్టే టీఆర్ఎస్ నుంచి బయటికొచ్చిన
  • నన్ను ఓడించేందుకు వందల కోట్లతో హంగామా ఎందుకు?
  • ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలపై నిఘా పెడ్తరా?
  • హుజూరాబాద్‌లో వివిధ కుల సంఘాలతో మీటింగ్

సీఎం కేసీఆర్​ పోరాటం ఒక హుజూరాబాద్ సీటు, ఒక ఎమ్మెల్యే కోసం కాదు. ఒకవేళ ఇక్కడ ఈటల గెలిస్తే రాష్ట్రమంతా ఎంతోమంది ఈటలలు తయారై, ఆయన్ను ఎక్కడ ప్రశ్నిస్తారో, నిలదీస్తారోననే భయం పట్టుకుంది. అందుకే ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇంత హంగామా చేస్తున్నారు. హుజూరాబాద్​లో వాళ్ల ఆటలు సాగయి. పైసలతో, బెదిరింపులతో ఏమీ చేయలేరు. చిల్లర ప్రయత్నాలకు చెంప చెల్లుమనేలా హుజూరాబాద్ ప్రజలు జవాబు చెప్తరు. కేసీఆర్​ అరాచకాలను తట్టుకోలేక రోషమున్న బిడ్డను కాబట్టే టీఆర్ఎస్ నుంచి బయటికొచ్చిన. ‑ బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్

హుజూరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్‌‌కు అరాచకం తప్ప ఎథిక్స్​ అనేవే లేవని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న 17 మంది ఎంపీలు, 119 మంది ఎమ్మెల్యేల ఫోన్లపై నిఘా పెట్టిన కేసీఆర్‌‌కు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హతే లేదని అన్నారు. ‘‘అంబేద్కర్​పెట్టిన రాజ్యాంగం ఉంది గనుక ఆగుతున్నారు. లేదంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎందుకు అని అందరినీ బయటకు పంపేవారు” అని ఎద్దేవా చేశారు. మంత్రి హరీశ్​రావు ఇంటి ఆడపడుచుకు అవకాశం ఉన్నా తనకే ఓటు వేస్తుందన్నారు. హుజూరాబాద్​లోని మధువని గార్డెన్స్​లో బుధవారం వివిధ కుల సంఘాలతో నిర్వహించిన మీటింగ్​లో ఈటల మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం జరిగిన రోజుల్లో ‘నా కాలిగోటికి సరిపోరు’ అని సీఎం కేసీఆర్ అన్నోళ్లంతా ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్నారని, ఉద్యమకారుడినైన తనను మాత్రం బయటకు పంపారని విమర్శించారు. 

‘‘ప్రగతి భవన్​లో కూర్చుని.. హుజూరాబాద్​లో వాళ్లను పోటీలో పెడ్త.. వీళ్లను పోటీలో పెడ్త అంటుంటే, వాళ్లను వీళ్లను ఎందుకు ‘సీఎం కేసీఆర్​నువ్వే రా.. లేదంటే మంత్రి హరీశ్​రావు రా.. పోటీలో నిలబడు’ అని  అన్నాను. దాన్ని కూడా వక్రీకరించి నేను వాళ్లిద్దరినీ అరేయ్ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. 18 ఏండ్ల రాజకీయ జీవితంలో నేను ఏనాడూ సంస్కారం తప్పలేదు” అని ఈటల అన్నారు. 
అసెంబ్లీలో నా మొహం కనవడద్దట
సీఎం కేసీఆర్​అవమానాలను, అరాచకాలను తట్టుకోలేక రోషమున్న బిడ్డను కాబట్టే మొదటగా బయటపడ్డానని, కొంత మంది బయటపడలేకపోతున్నరని ఈటల చెప్పారు. ‘‘హుజూరాబాద్​లో ఇప్పటికే 192 కోట్లు ఖర్చు పెట్టినం. ఇంకా ఎన్ని వందల కోట్లయినా ఖర్చు పెట్టండి. ఎన్ని జీవోలైనా ఇవ్వండి. ఏది అడిగితే అది ఇచ్చేయండి. కానీ ఈటల రాజేందర్ అనేటోడి ముఖం అసెంబ్లీలో కనబడొద్దు’’ అని సీఎం అన్నట్లు ఓ మిత్రుడు చెప్పాడన్నారు. ‘‘సీఎం కేసీఆర్​ పోరాటం ఒక హుజూరాబాద్ సీటు, ఒక ఎమ్మెల్యే కోసం కాదు. ఒకవేళ ఇక్కడ ఈటల గెలిస్తే రాష్ట్రమంతా ఎంతోమంది ఈటలలు తయారై, ఆయన్ను ఎక్కడ ప్రశ్నిస్తారో, నిలదీస్తారోననే భయం పట్టుకుంది. అందుకే ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇంత హంగామా చేస్తున్నారు” అని ఈటల చెప్పారు. హుజూరాబాద్​లో వాళ్ల పార్టీ వ్యక్తుల మీద కూడా నిఘా పెట్టుకున్నారన్నారు. వాళ్లంతా ఏం చేస్తున్నరు? నాతో టచ్​లో ఉన్నారా ? అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని చెప్పారు. ‘‘నేను చెబితే మీరు నమ్మరు.. కానీ ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థాయి లీడర్​ భార్య నాకు ఫోన్ చేసి మాట్లాడింది. ‘అన్నా..  నీకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని నేను నా భర్తతోని కొట్లాట పెట్టుకుంటున్నా’ అని చెప్పి నన్ను దీవించింది’’ అని వివరించారు.
గెలవకముందే ఇన్ని చేస్తున్న
నేను గెలిస్తే ఏం చేస్తానని హరీశ్​రావు లాంటివాళ్లు అంటున్నారని, కానీ తాను రాజీనామా చేశాకే దళితబంధు లాంటి పథకాలు వచ్చాయని ఈటల చెప్పారు. ఏడేండ్లుగా రాని రేషన్​కార్డులు, పింఛన్లు ఇప్పుడు వచ్చాయన్నారు. ‘‘దుబ్బాక ఎన్నికల ముందు ఇట్లాగే అన్నారు. బీజేపీ గెలిస్తే కరెంట్​బాయిల కాడ మీటర్లు పెడుతరని చెప్పారు. అక్కడ బీజేపీ గెలిచింది. మీటర్లు పెట్టారా? అక్కడ పింఛన్లు, రైతుబంధు ఆగినయా? ఇక్కడ నేను గెలిచినా ఏదీ ఆగదు” అని అన్నారు. పరకాల నుంచి చల్లా ధర్మారెడ్డిని, వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేశ్​ను ఇక్కడికి తీసుకువచ్చి టీఆర్ఎస్ ​గెలుపు కోసం ప్రచారం చేయిస్తున్నారని, కానీ ఎక్కడెక్కడి నుంచో వందల మంది వచ్చి ‘అన్నా నువ్వు గెలుస్తవ్’ అని చెబుతున్నారని అన్నారు. -దసరా, బతుకమ్మ పండుగలు ఏడాదికోసారి వస్తాయని, కానీ హుజూరాబాద్‌‌లో మాత్రం  మూడు నెలల నుంచి దసరా పండుగ నడుస్తోందన్నారు. ప్రజలంతా ‘రాజేందర్​అన్నా నీ వెంటే ఉంటాం’ అని చెబుతున్నారని చెప్పారు. కమలాపూర్​ఎంపీపీని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే.. ‘‘నేను కేసీఆర్ ఫొటోతో కాదు, రాజేందర్ అన్న ఫొటో పెట్టుకొని గెలిచిన’’ అన్నారని, ఇక్కడి ప్రజలు, నేతల గుండెల్లో ఈటల ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమన్నారు.
నీచమైన ప్రచారం చేస్తున్నరు
‘‘గ్రామాల్లో వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేయాలనుకుంటే అధికారులతో అయిపోతది. చట్టబద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు అది. కానీ దీన్ని వక్రీకరించి, నేనేదో భూములు ఆక్రమించినట్లు ఆరోపించిన్రు. రాజేందర్ ఏ తప్పు చేయలేదు కాబట్టే ఇలాంటి నీచమైన ప్రచారం చేస్తున్నరు’’ అని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.
హుజూరాబాద్‌‌లో నీ ఆటలు సాగవు
‘‘సీఎం కేసీఆర్.. హుజూరాబాద్​లో నీ ఆటలు సాగయి. కణతకు తుపాకీ పెట్టి ‘అన్నం పెట్టద్దు.. షెల్టర్ ఇవ్వద్దు’ అని భయపెట్టినా ‘సంపుకో కొడుకా’ అంటూ ఎదురు తిరిగిన ప్రాంతమిది. చైతన్యవంతమైన నేల. పైసలతో, బెదిరింపులతో మీరేమీ చేయలేరు. ఈ చిల్లర వేషాలు, చిల్లర ప్రయత్నాలకు చెంప చెల్లుమనేలా హుజూరాబాద్​ ప్రజలు జవాబు చెప్తరు’’ అని ఈటల అన్నారు. కేసీఆర్ అరాచకాలను ఆపే శక్తి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని, సందర్భం వచ్చినప్పుడు సంగతి తేలుస్తుందన్నారు. ‘‘హుజూరాబాద్​లో బీసీ బిడ్డను నిలబెట్టారని తెలిసింది. కానీ బీసీనా, ఓసీనా అని కాదు.. కేసీఆర్​కు కావాల్సింది బానిస మాత్రమే” అని ఈటల అన్నారు. బీజేపీ నాయకులు  జితేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్, గంగాడి కృష్ణారెడ్డి, తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.