అంగన్​వాడీ సెంటర్​ నుంచి గుంజుకుపోయి గొంతు కోసి చంపిండు

అంగన్​వాడీ సెంటర్​ నుంచి గుంజుకుపోయి గొంతు కోసి చంపిండు

చిగురుమామిడి, వెలుగు:  అంగన్​వాడీ సెంటర్​లో జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయాను అందరూ చూస్తుండగానే ఆమె భర్త కత్తితో గొంతు కోసి చంపాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం..కరీంనగర్​ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కనకం ప్రవీణ్​ప్లంబర్.  కేశవపట్నంకు చెందిన ఆరెపల్లి శిరీష (30)ను పదేండ్ల కింద పెండ్లి చేసుకున్నాడు. వీరికి పిల్లలు శరణ్య(9), శశివర్ధన్​(7) ఉన్నారు. శిరీష ఇందుర్తిలోని అంగన్​వాడీ సెంటర్​లో ఆయాగా పని చేస్తోంది. భర్తతో గొడవలు జరగడంతో పీఎస్​లో కొన్ని సార్లు కంప్లయింట్​చేసింది. అప్పటినుంచి కేశవపట్నంలో ఉంటోంది.

ఇటీవల ప్రవీణ్​కు శిరీష అడ్వొకేట్​ద్వారా లీగల్​నోటీసులు పంపించింది. దీన్ని ప్రవీణ్​అవమానంగా భావించాడు. సోమవారం శిరీష ఇందుర్తి అంగన్​వాడీ సెంటర్​కు వచ్చి పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొంది. అక్కడికి వచ్చిన పిల్లలతో పాటు గెస్టులకు చాక్లెట్లు, ప్రసాదం సిద్ధం చేస్తుండగా ప్రవీణ్​ కత్తితో సెంటర్​లోకి వచ్చాడు. అందరూ చూస్తుండగానే శిరీషను బయటికి లాక్కెళ్లి ముక్కు మూసి మెడ పట్టుకుని కత్తితో గొంతు కోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. శిరీషను చంపవద్దని తాము బతిమిలాడినా ప్రవీణ్ వినలేదని, అడ్డువస్తే తమను చంపేస్తానని బెదిరించాడని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. అయినా కుమార్​ అనే వ్యక్తి ధైర్యం చేసి అడ్డుకోబోగా కత్తితో గాయపరిచాడు. శిరీషను చంపిన తర్వాత నిందితుడు చిగురుమామిడి పీఎస్​లో లొంగిపోయాడు. తిమాపూర్​ సీఐ శశిధర్​రెడ్డి, చిగురుమామిడి ఎస్సై దాస సుధాకర్​ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.