నా కట్టే కాలేవరకు తెలంగాణ కోసం పోరాడుతా: కేసీఆర్

నా కట్టే  కాలేవరకు తెలంగాణ కోసం పోరాడుతా: కేసీఆర్

తాను ఉన్నంతవరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను.. ఆరు నూరైనా ఏ విషయంలోనైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వన్నారు కేసీఆర్. అందుకే ఛలో నల్లగొండకు పిలుపు నివ్వడంతో కాంగ్రెస్ నాయకులు ఆగమాగమైతున్నరని చెప్పారు. కేసీఆర్.. నల్గొండలో సభ పెడితే.. ఇజ్జత్ మానం పోతదని.. అర్జెంట్ గా బడ్జెట్ ను పక్కకు పెట్టి కృష్ణా ప్రాజెక్టులపై తీర్మానం పెట్టారన్నారు. ఆ తీర్మానం కూడా సక్కగా లేదు.. వాళ్ల తెలివి సల్లారా అని ఎద్దేవా చేశారు.  ఆ తీర్మానంలో కరెంటు ఉత్పతి పెట్టలేదని.. అంత తెలివి తక్కువ తీర్మానమని చురకలంటించారు. 

ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ కోసం నా కట్టె కాలేవరకు, చివరి శ్వాస వరకు పోరాడుతానని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చిందంటే ఏం చేయాలి.. గత ప్రభుత్వం కంటే నాలుగు మంచి పనులు చేయాలి..కానీ పొద్దున లేస్తే కేసీఆర్ తిట్టాలనే పని పెట్టుకున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులు ఎలా దుర్భాషలాడుతున్నారో.. ఎంత దుర్మార్గ పద్దతుల్లో మాట్లాడుతున్నారో  మీరందరూ చూస్తున్నారని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. కానీ తెలంగాణ ప్రజలు హక్కులు శాశ్వతం, మన బతుకులు నిజం, మన పిల్లల భవిష్యత్ నిజం అని అన్నారు. దానికోసం అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ప్రజల పక్షాన  కొట్లాడి  తెలంగాణను సాధించి తెచ్చినవాళ్లం కాబట్టీ.. మనమందరం అప్రమత్తంగా ఉండాలని.. మన పోరాటం కొనసాగుతూనే ఉండాలని కేసీఆర్ చెప్పారు.