పాలమూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్​​ కౌన్సిలర్ల నారాజ్​

పాలమూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్​​ కౌన్సిలర్ల నారాజ్​
  • ఓ లీడర్​ జోక్యంతో ప్రయారిటీ దక్కడం లేదని ఆవేదన
  • కౌన్సిల్​ మీటింగ్ కు​మాకుమ్మడిగా డుమ్మా
  •  పార్టీ మారే యోచనలో పలువురు లీడర్లు

మహబూబ్​నగర్, వెలుగు: రూలింగ్​ పార్టీకి చెందిన మున్సిపల్​ కౌన్సిలర్లు నారాజ్​లో ఉన్నారు. వార్డుల్లో డెవలప్​మెంట్​ పనులు జరగక, సమస్యలపై పబ్లిక్​కు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల్లో జరిగే అభివృద్ధి పనుల భూమిపూజ, శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో కూడా సరైన ప్రయారిటీ ఇవ్వడం లేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన మున్సిపల్​ మీటింగ్​కు మాకుమ్మడిగా డుమ్మా కొట్టగా, ఫోన్లు చేసి మరీ సమావేశానికి పిలిపించుకోవాల్సి వచ్చింది.

పెండింగ్​లో డెవలప్​మెంట్​ వర్క్స్..

మహబూబ్​నగర్​ మున్సిపాల్టీలో 49 వార్డులున్నాయి. ఇందులో 43 చోట్ల బీఆర్ఎస్, 3 చోట్ల బీజేపీ, 2 చోట్ల ఎంఐఎం, ఒక వార్డు నుంచి కాంగ్రెస్​ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అపోజిషన్​ కౌన్సిలర్లు వారి పరిధిలోని వార్డు సమస్యలపై మున్సిపల్​ సమావేశాల్లో తమ వాయిస్​ వినిపిస్తుండగా, రూలింగ్​ పార్టీకి చెందిన కౌన్సిలర్లు సమస్యలు చెప్పుకోలేక, సమస్యలు పరిష్కారం కాక తిప్పలు పడుతున్నారు. కొన్ని వార్డుల్లో  2018లో డ్రైనేజీలు, రోడ్లు, పైపులైను పనులు ప్రారంభించగా, బిల్లులు పెండింగ్​ పెట్టడంతో పనులు కంప్లీట్​ చేయలేదు. ఇటీవల మున్సిపాల్టీకి స్పెషల్​ ఫండ్స్​ వచ్చాయని పనులు చేయాలని ఓ లీడర్​ చెప్పినా, పెండింగ్​ బిల్లులు మంజూరైన తర్వాత పనులు స్టార్ట్​ చేస్తామని కాంట్రాక్టర్లు అంటున్నట్లు తెలిసింది. 

మున్సిపాల్టీకి చెందిన ఫండ్స్​తో జిల్లా కేంద్రంలో బ్యూటిఫికేషన్​ పనులు చేస్తుండడంతో రూలింగ్​ పార్టీలోని కొందరు కౌన్సిలర్లు అసంతృప్తిలో ఉన్నట్లు తెలిసింది. వార్డుల్లో పెండింగ్​ పనులు పూర్తి చేయకుండా మెయిన్ రోడ్లు, కూడళ్ల వద్ద బ్యూటిఫికేషన్​పైనే సదరు లీడర్​ ఫోకస్​ పెట్టడంపై తమ సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు వార్డుల్లో చిన్న సమస్యలతో పాటు అధికారిక కార్యక్రమాల్లో ఆ లీడర్​ జోక్యం చేసుకోవడం, తమ ప్రమేయం లేకుండానే వార్డుల్లో పనులు చేయించడంతో గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

టైం కోసం వెయిటింగ్..

అసంతృప్తిలో ఉన్న రూలింగ్​ పార్టీకి చెందిన కౌన్సిలర్లు తరచూ మున్సిపల్​ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. 5 రోజుల కింద నిర్వహించిన సమావేశానికి కౌన్సిలర్లంతా హాజరయ్యేలా 8 మంది కౌన్సిలర్లకు ఒక మున్సిపల్  ఆఫీసర్​ను కేటాయించారు. కానీ, సమావేశానికి సగం మంది డుమ్మా కొట్టారు. ఉదయం 11 గంటలకు సమావేశం స్టార్ట్​ కావాల్సి ఉండగా, 15 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో గైర్హాజరైన కౌన్సిలర్లకు ఫోన్లు చేసి రప్పించారు. దీంతో గంట ఆలస్యంగా సమావేశం ప్రారంభమైంది. అప్పటికీ 29 మంది కౌన్సిలర్లు హాజరు కాగా, 20 మంది గైర్హాజరయ్యారు. అయితే, అసంతృప్తిలో ఉన్న కౌన్సిలర్లు పార్టీ మారే ప్లాన్​ చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సరైన టైం కోసం వెయిట్​ చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని సెట్​ చేసేందుకు కీ రోల్​ పోషించే ఒక లీడర్​ రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఆయన నారాజ్​లో ఉన్న కౌన్సిలర్లను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

జడ్చర్ల మున్సిపాల్టీలోనూ అంతే..

జడ్చర్ల మున్సిపాల్టీలోనూ కౌన్సిలర్లు అసంతృప్తిలో ఉన్నారు. గత జనవరిలో జరిగిన మీటింగ్​లో తమ వార్డు పరిధిలో సమస్యలు పరిష్కరించడం లేదని రూలింగ్​ పార్టీ కౌన్సిలర్లు ఏకంగా సమావేశాన్ని బాయ్​కాట్​ చేశారు. నియోజకవర్గ లీడర్​కు అత్యంత సన్నిహితంగా ఉండే వారి పనులే చేస్తున్నారని, ఆఫీసర్లు కూడా వారి మాటే వింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మీటింగ్​లోనూ మున్సిపల్​ నిధుల ఖర్చుపై తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.