తల్లిని సంతోష పెట్టేందుకు పోలీసు డ్రస్ వేసి జైలు పాలు

తల్లిని సంతోష పెట్టేందుకు పోలీసు డ్రస్ వేసి జైలు పాలు

విజయవాడ: తల్లిని సంతోష పెట్టేందుకు ఓ నిరుద్యోగి చేసిన పని చివరకు అతన్ని జైలు పాలు చేసింది. తల్లి కళ్లలో అనందం కోసం తనకు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందని నమ్మబలికి పోలీస్ యునిఫాం వేసి.. అపై కటకటలా పాలైన వైనం కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించి.. విఫలమై.. చివరకు ప్రైవేటు ఉద్యోగంతో నెట్టుకొస్తున్న యువకుడు తన తల్లికి మాత్రం కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యానని నమ్మించి ఆమె కోసం ఇంటికి వచ్చినప్పుడల్లా యూనిఫాం వేసుకుని వస్తున్న కృష్ణా జిల్లా తోట్ల వల్లూరుకు చెందిన పృథ్వీరాజ్ అనే యువకుడు సోమవారం నాడు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. 
పోలీసు ఉద్యోగానికి విశ్వప్రయత్నం చేసి విఫలమైన పృథ్వీరాజ్ ఇంటి దగ్గర ఉన్న తల్లికి తనకు పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యానని చెప్పి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.  ఇంటికి వెళ్లే టప్పుడు పోలీసు యూనిఫామ్ ధరించి పోలీసు విధులు నిర్వహిస్తున్నని నమ్మబలికేవాడు. నున్న పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా పోలీసులకు తారసపడిన పృథ్విరాజు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు నిలబెట్టి ప్రశ్నించారు. అతని గురించి ఆరా తీయగా ఈ నకిలీ పోలీస్ అవతారం బయటపడింది. దీంతో పోలీసులు పృథ్వీరాజ్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.