
పంజాబ్ లో పంటపొలాల్లో గడ్డి కాల్చివేతల అంశంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టుపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. రైతులను ఎందుకు విలన్లుగా చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీతోపాటు నార్త్ ఇండియాలో ఏటా చలికాలంలో పెరుగుతున్న పొల్యూషన్ను తగ్గించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎస్ ధులియాతో కూడిన సుప్రీం బెంచ్ మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టుపై అసంతృప్తిని వ్యక్తంచేసింది. ‘‘ప్రతిసారీ ఎందుకు రైతులను విలన్లుగా చూపిస్తున్నరు. ఇక్కడ మేం వాళ్లను విచారించడం లేదు. పంట వ్యర్థాలను కాల్చివేయడానికి రైతులకు చాలా కారణాలు ఉండొచ్చు. యంత్రాలతో పంట వేస్టేజీ మేనేజ్మెంట్ ను పంజాబ్ ప్రభుత్వం ఎందుకు 100 శాతం ఫ్రీగా చేపట్టడం లేదు? హర్యానా సర్కార్ పంట వ్యర్థాలను కాల్చకుండా అక్కడి రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నది. ఈ విషయంలో వారి నుంచి మీరు సలహాలు ఎందుకు తీసుకోకూడదు” అని సుప్రీంకోర్టు పంజాబ్ ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో పొల్యూషన్ కట్టడికి పొరుగు రాష్ట్రాలు కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ‘గత ఆరేండ్లతో పోలిస్తే ఈ నవంబర్లో పొల్యూషన్ చాలా ఎక్కువుంది. సమస్య అందరికీ తెలుసు. దాన్ని నివారించే బాధ్యత మీదే” అని వ్యాఖ్యానించింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరు 5వ తేదీకి వాయిదా వేసింది.
మా ఆదేశాలు పట్టించుకోరా?
ఢిల్లీ-మీరఠ్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఆర్ఆర్ టీఎస్) నెట్ వర్క్ కు ఢిల్లీ ప్రభుత్వం నుంచి నిధులు ఆలస్యమవడంపైనా సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ‘మీరు మా ఆర్డర్లను పట్టించుకోవడం లేదు. ఇక, మాకు మరో మార్గం లేదు. వారం రోజుల్లోగా ఢిల్లీ ప్రభుత్వం ఆ ఫండ్స్ చెల్లించాలి. లేదంటే మీ ప్రచారం కోసం కేటాయించుకున్న నిధుల్లో నుంచి ఆ డబ్బులు బదిలీ చేస్తం” అని హెచ్చరించింది.