
రాంచీ: జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్, బస్ ఢీకొని 18 మంది మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అటవీ ప్రాంతం సమీపంలో గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్‌ను బస్ ఢీకొట్టడం ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం (జూలై 29) తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ప్రయాణికులతో వెళ్తోన్న బస్‌పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ (డుమ్కా జోన్) శైలేంద్ర కుమార్ సిన్హా తెలిపారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఘటన స్థలంలో జిల్లా యంత్రాంగం సహయక చర్యలు కొనసాగిస్తోందని తెలిపారు.