
- సాగునీటి కోసం రైతుల ఎదురుచూపులు
- మిడ్ మానేరు నిండితేనే లోయర్ మానేరు కు నీరు
- ప్రస్తుతం లోయర్ మానేరులో 7 టీఎంసీలు మాత్రమే
- జిల్లాలో ఎస్సారెస్పీ కింద 2.20 లక్షల ఆయకట్టు
- 15 రోజుల్లో నీటిని విడుదల చేస్తామని ఆఫీసర్ల ప్రకటన
- యాదాద్రి జిల్లాలో తగ్గిన సాగు విస్తీర్ణం
సూర్యాపేట, యాదాద్రి వెలుగు : సూర్యాపేట జిల్లాకు సాగు నీరందించే శ్రీరాంసాగర్ రెండో దశ నీటి విడుదల కోసం తుంగతుర్తి రైతాంగం ఎదురు చూస్తోంది. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు వస్తుండడంతో రైతులు ఆశాలన్నీ ఎస్సారెస్పీపైనే పెట్టుకున్నారు. ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎస్సారెస్పీ మీదనే రైతాంగం ఆధారపడి ఉండగా, ప్రాజెక్ట్ నీటి మట్టం పెరుగుతుండడంతో నీటి విడుదలపై సందిగ్ధం నెలకొంది.
మొన్నటి వరకు సరైన వర్షాలు లేకపోవడం, శ్రీరాంసాగర్ నుంచి నీటి విడుదల ఆలస్యం కానుండడంతో పంటలు సాగు చేస్తున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. అయితే త్వరగా ఎస్సారెస్పీ కాల్వలకు నీటి విడుదల చేయాలని రైతులు కోరుతుండగా, మరో 15 రోజుల్లో నీటి విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
2.20 లక్షల ఎకరాల్లో సాగు..
జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 2.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఎస్సారెస్పీ రెండో దశ కింద ఉంది. 2018 నుంచి ఎస్సారెస్పీ ద్వారా గోదావరి జలాలతో వరుసగా ఏటా రెండు పంటలకు సాగు నీరందిస్తున్నారు. శ్రీరాంసాగర్ ఎత్తిపోతల ద్వారా నీటిని ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు మీదిగా జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు చేరుతుంది. అయితే ఎగువ నుంచి వరద లేకపోవడంతో తొలిసారిగా వానాకాలం కూడా ఆయకట్టుకు నీటిని అందించే పరిస్థితి లేకుండాపోయింది. గోదావరి జలాలు వస్తాయన్న ఆశతో రైతులు ఇప్పటివరకు వరి సాగు చేయకుండా ఎదురు చూస్తున్నారు.
పై నుంచి వరద లేకపోవడంతో..
ఎస్సారెస్పీ ప్రస్తుతం సగం మాత్రమే నిండడంతో వానాకాలం సీజన్ లో పంటలకు సరిపడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అలాగే ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి మిడ్ మానేరు.. అక్కడి నుంచి లోయర్ మానేరు మీదిగా సూర్యాపేట జిల్లాకు నీటిని అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మిడ్ మానేరులో 27 టీఎంసీలకు 15 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండగా, లోయర్ మానేరులో 23 టీఎంసీలకు 7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మిడ్ మానేరు లో 27 టీఎంసీల నీటి నిల్వ ఉంటే లోయర్ మానేరు కు నీటి విడుదల చేసే అవకాశం ఉంటుంది. మరో వారం రోజుల్లో రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళికా కమిటీ సమావేశమై నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఆశించిన మేర ప్రాజెక్టులోకి నీరు వస్తే 15 రోజుల్లో నీటి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
చెరువులు వెలవెల..
సూర్యాపేట జిల్లాలో మొత్తం 1225 చెరువులు ఉండగా, ఎస్సారెస్పీ కింద 967 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులు సూర్యాపేట, తుంగతుర్తి పరిధిలో ఉండగా, ప్రస్తుతం ఎస్సారెస్పీ కాల్వలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో నాగార్జునసాగర్ నిండడంతో ఈ ప్రాజెక్టుల కింద ఉన్న చెరువులు నిండే అవకాశం ఉంది. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల రైతులకు నీరు అందించే ఎస్సారెస్పీ కాల్వకు నేటికీ నీటి విడుదల జరగలేదు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తే తప్ప ఈ రెండు నియోజకవర్గాల్లో చెరువులు నిండే అవకాశం ఉంది. చెరువులు నిండితే రైతులకు రెండు సీజన్ల పంటలకు నీరు వచ్చే అవకాశం ఉంటుంది.
యాదాద్రి జిల్లాలో తగ్గిన సాగు విస్తీర్ణం..
గతేడాదితో పోలిస్తే ఈసారి యాదాద్రి జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గింది. వాన దేవుడి దోబూచులాట కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు పెరిగితే యాదాద్రి జిల్లాలో భారీగా తగ్గింది. ఈ సీజన్లో అన్ని పంటలు కలిపి గతంలో కంటే 15 వేల ఎకరాల్లో ఎక్కువగా పంటలు సాగు అవుతాయని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. గతేడాది ఇదే సీజన్లో 2,87,985 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఇప్పుడు 2,06,523 మాత్రమే చేశారు. మొత్తంగా 81,462 ఎకరాల్లో వరి సాగు తగ్గింది.
గతేడాది 4283 ఎకరాల్లో కంది సాగు చేసిన రైతులు ఈసారి 3,037 ఎకరాలకు పరిమితమయ్యారు. గతేడాదిలో జొన్న సహా ఇతర పంటలన్నీ కలిపి 24 వేల ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 3,274 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. ఐదేండ్లుగా పత్తి పంట తగ్గుతూ వస్తోంది. గతేడాది 1.08 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈసారి 80 వేల ఎకరాలకు చేరింది.
15 రోజుల్లో నీటిని విడుదల చేస్తాం
శ్రీరామ్ సాగర్ లో 50 శాతం మాత్రమే నీరు నిల్వ ఉంది. ఎగువన ఉన్న రాష్ట్రాల్లో వర్షాలు పడుతుండడంతో ప్రాజెక్ట్ లోకి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మరో వారం రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి 15 రోజుల్లో ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేస్తాం ధర్మతేజ, ఎస్ఈ, ఎస్సారెస్పీ