ప్రాణాలు పోతున్నా పట్టించుకుంటలే

ప్రాణాలు పోతున్నా పట్టించుకుంటలే
  • కేంద్రం ఇచ్చిన ఇన్‌‌ఫుట్​ సబ్సిడీ  కూడా ఇవ్వని రాష్ట్ర సర్కారు
  •  గులాబ్ తుఫాన్ వల్ల నష్టపోయిన  పంటలపై సర్వే చేస్తలే
  •  ఆవేదనతో నాలుగు రోజుల్లో ముగ్గురు రైతుల ఆత్మహత్య


వెలుగు, నెట్​వర్క్: వర్షాలకు పంటలు నష్టపోయి రైతులు ప్రాణాలు తీసుకుంటున్నా.. నష్టపరిహారం విషయంపై రాష్ట్ర సర్కారు స్పందించడం లేదు. పంట నష్టం అంచనావేసి ఇన్‌‌ఫుట్ సబ్సిడీ ఇవ్వాలని హైకోర్టు చెప్పినా, రైతులను ఆదుకోవాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. కనీసం రైతుల్లో మనోధైర్యం నింపేందుకైనా పరిహారంపై ప్రకటన చేయడం లేదు. ఫలితంగా గత నాలుగు రోజుల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోగా, ఓ మహిళా రైతు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
రైతులకు పైసా ఇవ్వలే
నిరుడు అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, ఇతర పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ నిర్వహించిన సర్వేల్లో తేలింది. ఇందుకు సంబంధించి విపత్తుల నిర్వహణ కింద కేంద్రం రూ.595 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర వాటాతో కలిపితే రూ.978 కోట్లు ఉన్నా.. నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. నిరుడు నష్టపోయిన రైతులకు 4 నెలల్లో పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. గులాబ్ తుఫాను దెబ్బకు వివిధ జిల్లాల్లో 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గోదావరి, దాని ఉపనదుల వెంట, కాళేశ్వరం బ్యాక్​ వాటర్ ​వల్ల 50 వేల ఎకరాల వరకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ ఆఫీసర్లు, రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.
ఒకే రోజు మూడు ఘటనలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఏలేటి రామయ్యపల్లికి చెందిన ఉమ్మనవేని ఎల్లయ్య(62).. తనకున్న 6 ఎకరాలతోపాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి సాగు చేశాడు. గులాబ్​ఎఫెక్ట్​తో కురిసిన భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చలేనని ఎల్లయ్య ఆందోళన చెందాడు. సెప్టెంబర్ 29న చేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. ఆయనకు భార్య రాధమ్మ, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటకు చెందిన పండుగ చిన్న రాజయ్య (60).. తనకున్న మూడెకరాలతోపాటు 5 ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి, వరి పంటలు వేశాడు. తన సొంత భూమిని ఐసీఐసీఐ బ్యాంకులో తాకట్టు పెట్టి 4 లక్షలు అప్పు తెచ్చి పెట్టుబడిగా పెట్టాడు. కానీ భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పంట నష్టపోవడం, అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆవేదనకు గురై పురుగుల మందు తాగి సెప్టెంబర్ 29న చనిపోయాడు. ఆయనకు భార్య సరోజ, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.  నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడకు చెందిన మహిళా రైతు నాగమణి ఎకరన్నర భూమిలో  వరిపంట సాగుచేసింది. గులాబ్ తుఫాను కారణంగా వరదలతో పంట మొత్తం నీటమునగడంతో రూ. 60 వేలు నష్టపోయింది. గతేడాది ఇలాగే నష్టపోయినా సర్కారు పరిహారం చెల్లించడంలేదు. దీంతో ఈ నెల 29న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. తోటి రైతులు అడ్డుకుని కాపాడారు. ఈ సమయంలో అక్కడే ఆమె గుండెలవిసేలా రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ‘పోయినేడు అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నాలుగు నెలల్లోగా జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ చట్టం కింద ఇన్‌‌ఫుట్‌‌ సబ్సిడీ ఇవ్వాలి. పంట నష్టాన్ని మూడు నెలల్లో అంచనా వేసి.. ఆ తర్వాత మరో నెల రోజుల్లోగా కౌలు రైతులు సహా బాధిత రైతులందరికీ పరిహారం చెల్లించాలి’’
                                                                                                                                                                     ‑ సెప్టెంబర్ 28న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు

అప్పుల బాధతో మరో యువ రైతు సూసైడ్​
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సొనాలకు చెందిన ఎకిలేరి శశిధర్​(31).. తన నాలుగు ఎకరాల భూమితోపాటు ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని సోయా పంట వేశాడు. గులాబ్ తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాలు, వరదలకు కౌలుకు తీసుకున్న 6 ఎకరాల్లో వేసిన సోయా పంట పూర్తిగా పాడైపోయింది. గతేడాది సరైన దిగుబడులు రాక అప్పుల పాలయ్యాడు. బ్యాంకులో రూ.1.5 లక్షలు, ప్రైవేటు అప్పులు రూ.6 లక్షల వరకు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం 10 గంటలకు సద్ది తీసుకొని పొలానికి వెళ్లాడు. కానీ సాయంత్రం అవుతున్నా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు వెతకగా ఆదివారం ఉదయం తన పొలంలో చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. శశిధర్‌‌‌‌కు ఇద్దరు కొడుకులు ఉన్నారు.