రైతులకు గుడ్ న్యూస్ : రెండు రోజుల్లోనే వడ్ల పేమెంట్లు

రైతులకు గుడ్ న్యూస్ : రెండు రోజుల్లోనే వడ్ల పేమెంట్లు
  • స్పీడ్​గా ఓపీఎంఎస్​ ఎంట్రీ
  • కొన్ని సెంటర్లలో గన్నీ బ్యాగుల కోసం రైతుల తిప్పలు
  • సకాలంలో లారీలు రాక ఇబ్బందులు

మహబూబ్​నగర్, వెలుగు: కొనుగోలు సెంటర్లలో సేకరించిన వడ్లకు రాష్ట్ర సర్కారు ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. మిల్లర్లు ట్రక్​ షీట్లు ఇచ్చిన 24 గంటల్లోనే రైతుల వివరాలను ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేస్తుండడంతో పేమెంట్లు స్పీడ్​గా జరిగిపోతున్నాయి. ఇక సన్నాలకు సంబంధించి క్వింటాల్​కు రూ.500 బోనస్​ డబ్బులు వడ్లు అమ్మిన వారం తరువాత ఖాతాల్లో జమ అవుతున్నాయి.

రూ.140 కోట్ల చెల్లింపులు..

మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో ఈ యాసంగిలో పెద్ద మొత్తంలో రైతులు  వరి వేయగా.. అదే స్థాయిలో దిగుబడులు వచ్చాయి. రెండు జిల్లాల్లో దాదాపు మూడున్నర లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లను ప్రభుత్వ కొనుగోలు సెంటర్ల ద్వారా సేకరించాలని టార్గెట్​గా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 60 శాతం మేర వడ్లు సెంటర్లకు చేరాయి. సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లు ఇచ్చిన లెక్కల ప్రకారం.. నారాయణపేట జిల్లాలో 107 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెంటర్లలో 1.50 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లను సేకరించాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 97 సెంటర్లను ఓపెన్​ చేసి, 90 వేల మెట్రిక్​ టన్నుల వడ్లను 11,924 మంది రైతుల నుంచి సేకరించారు. 

వీటిలో సాధారణ రకం 2.18 లక్షల క్వింటాళ్లు, మేలు రకం వడ్లు 6.78 క్వింటాళ్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఓపీఎంఎస్​ పూర్తి చేశారు. రైతులకు రూ.181 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. వీటిలో రూ.83.85 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా రూ.98.09 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బులను ఒకటి, రెండు రోజుల్లో రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. మహబూబ్​నగర్​ జిల్లాలో రెండు లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని టార్గెట్​ పెట్టుకోగా.. 188 సెంటర్లను ఓపెన్​ చేశారు. ఇప్పటి వరకు 68 మెట్రిక్​ టన్నుల వడ్లకు ఓపీఎంఎస్​ పూర్తి చేసి రూ.58 కోట్ల వడ్ల పైసలను రైతుల అకౌంట్లలో జమ చేశారు.

ఈ -కుబేర్​లో పెండింగ్..​

సన్నాల సాగు చేసిన రైతుల అకౌంట్లలోకి ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్​కు రూ.500 బోనస్​ డబ్బులు జమ కావడం లేదు. ఇప్పటికే వడ్లు మిల్లులకు చేరగా, మిల్లర్లకు ట్రక్​ షీట్లను కూడా జారీ చేశారు. అలాగే ఓపీఎంఎస్​ పూర్తి చేసి.. రైతుల పాస్​ పుస్తకాలు, బ్యాంకు పాసు పుస్తకాలు, బ్యాంక్​ అకౌంట్లను కూడా కన్ఫర్మేషన్​ చేశారు. ఆన్​లైన్​లో అప్​లోడ్​ కూడా పూర్తయింది. మహబూబ్​నగర్​ జిల్లాలో బోనన్​కు సంబంధించిన డబ్బులు రూ.6 కోట్ల వరకు ఉండగా, డబ్బులు ఈ -కుబేర్​లో పెండింగ్​లో ఉన్నట్లు తెలిపింది. వారం రోజుల్లో ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోనస్​ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతామని చెబుతున్నారు. నారాయణపేట జిల్లాలో బోనస్​ డబ్బులు రూ.2.10 కోట్ల వరకు ఉన్నాయి.

గన్నీ బ్యాగుల కోసం ఆందోళనలు..

గన్నీ బ్యాగుల కోసం ప్రతి రోజూ ఏదో ఒక చోట రైతులు ఆందోళనకు దిగుతూనే ఉన్నారు. ప్రధానంగా ఆలస్యంగా పంటలు వేసిన ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. జనవరి చివరి వారంలో వరి సాగు చేసిన మాగనూరు, కృష్ణ, మరికల్  తదితర ఏరియాల్లో 15 రోజుల కింద కోతలు పూర్తయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతాల్లోని సెంటర్లకు వడ్లు వస్తున్నాయి. అదనంగా వస్తున్న వడ్లకు సరిపడా గన్నీ బ్యాగులు లేక సమస్య వస్తోంది. ఈ విషయాన్ని సెంటర్ల నిర్వాహకులు ఉన్నతాధికారులకు తెలియజేయగా, అదనంగా గన్నీ బ్యాగులు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు.

రెండు రోజుల్లో పైసలు పడ్డయ్..

నాకున్న 12 ఎకరాల్లో వరి వేసిన. గ్రౌండ్  వాటర్​ తగ్గి, ఎండలు బాగా కాసినా.. 850 బస్తాల దిగుబడి వచ్చింది. కొనుగోలు సెంటర్​లో అమ్మిన రెండు రోజులకే పంటకు సంబంధించిన డబ్బులు రూ.7.88 లక్షలు నా అకౌంట్లో జమ అయ్యాయి. బోనస్​ పైసలు ఇంకా జమ కాలేదు. - హాజీబాబా, రైతు, అప్పంపల్లి

ఎంట్రీలు స్పీడ్​గా చేస్తున్నాం..

వడ్ల కొనుగోళ్లు స్పీడ్​గా జరుగుతున్నాయి. గతం కంటే ఈ సారి ఎక్కువ దిగుబడి వచ్చింది. సెంటర్లకు వస్తున్న వడ్లను వెంటనే కాంటా చేసి అలాట్​ చేసిన మిల్లులకు పంపుతున్నాం. అక్కడ వడ్లను దింపుకున్నాక, ట్రక్​ షీట్​ ఆధారంగా రైతుల వివరాలను ట్యాబ్​ల ద్వారా ఆన్​లైన్​లో ఎంట్రీ చేసే ప్రక్రియను స్పీడ్​గా చేస్తున్నాం. రైతులు అన్ని పత్రాలు అందజేస్తే ఎంట్రీ చేసిన 24 గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయి.  

రవి నాయక్, సివిల్​ సప్లయ్​ డీఎం, మహబూబ్​నగర్​