- అదను చూసి లూటీ చేస్తున్న దొంగలు
- చోరీల ఛేదనలో వెనుకబడుతున్న పోలీసులు
- గతేడాది 356 చోరీల్లో రూ.10.10 కోట్లకుపైగా లాస్
- రికవరీ కేవలం 45 శాతం మాత్రమే..
హనుమకొండ, వెలుగు: వరుస పండుగల సీజన్ వచ్చేసింది. మరో పది రోజుల్లోనే సంక్రాంతి పండగ జరగనుండగా, ఈ నెలాఖరులోనే సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. వనదేవతల దర్శనానికి ముందు తీర్థయాత్రలకు వెళ్లేవారితో పాటు పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నవారిని దొంగతనాలు కలవరానికి గురి చేస్తున్నాయి.
వరంగల్ నగర పరిధిలో తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి వివిధ ప్రాంతాలకు చెందిన దుండగులు చోరీలకు పాల్పడుతుండగా, దొంగలను గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఏటికేడు చోరీలు పెరిగిపోవడం, రికవరీలు అంతంతమాత్రంగానే ఉంటుండటంతో కేసుల ఛేదనలో పోలీసులు వెనకబడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టార్గెట్ ట్రై సిటీ..
వరంగల్ ట్రై సిటీకి రోడ్డు, రైలు మార్గాలతో కనెక్టివిటీ పెరిగిపోవడంతో దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్ తదితర ప్రాంతాలకు చెందిన దొంగల ముఠాలు నగరాన్ని టార్గెట్ చేస్తున్నాయి. దీంతో ఏటా పండుగల సీజన్ వచ్చిందంటే వరంగల్ నగరంలో చోరీలు కామనైపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ సిటీలోకి ఎంటరవడం, శివారు కాలనీలు, తాళం వేసి ఉన్న ఇండ్లను కొల్లగొట్టి అందినకాడికి దోచుకుపోవడం పరిపాటిగా మారింది. ఫలితంగా ఏటికేడు చోరీలు సంఖ్య పెరుగుతూ వస్తోంది. దుండగులు పక్కా ప్లాన్ తో చోరీలకు పాల్పడుతుండగా, వారిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా కేసుల డిటెక్షన్, చోరీ సొత్తు రికవరీ సగం కూడా ఉండటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చోరీలెక్కువ.. రికవరీ తక్కువ
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 2024లో జరిగిన 946 దొంగతనాల్లో రూ.24.73 కోట్ల వరకు దుండగులు ఎత్తుకెళ్లగా, అందులో రూ.7.84 కోట్లు మాత్రమే పోలీసులు రికవరీ చేశారు. 2025లో జరిగిన 1,056 దొంగతనాల్లో రూ.10.10 కోట్లు వరకు గల్లంతవగా, రూ.4.5 కోట్లు రికవరీ చేశారు. ఓవరాల్ గా రికవరీ పర్సంటేజీ 45 శాతం మాత్రమే కావడం గమనార్హం. ఇదిలాఉంటే వరంగల్ నగరంలోని తాళం వేసి ఉన్న ఇండ్లను దొంగలు టార్గెట్ చేస్తుండగా, ఏడాది కాలంలో మొత్తంగా 356 ఇండ్లలో చోరీలు జరిగాయి. అందులో 193 కేసులను పోలీసులు ఛేదించగా, 163 కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి.
పండుగల వేళ జాగ్రత్త..
మేడారం జాతర సమీపిస్తుండటంతో చాలామంది వేములవాడ, కొండగట్టు, తదితర దేవుళ్ల మొక్కులు తీర్చుకునేందుకు ఇండ్లకు తాళాలు వేసి వెళ్తున్నారు. ఇదే సమయంలో గుర్తు తెలియని దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. మేడారంతో పాటు ఐనవోలు, కొత్తకొండ, అగ్రంపహాడ్ తదితర జాతర్లు సమీపిస్తుండగా, సంక్రాంతి పండుగకు సొంతింటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నవారు అలర్ట్ గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పండుగలకు సొంతూళ్లకు వెళ్లినా, తాళాలు వేసి తీర్థయాత్రలకు వెళ్లినా పక్కింటి వారితో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. ముఖ్యంగా భద్రత కోసం కాలనీలు, ఇండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
