
- ప్రాథమికంగా అంచనా వేసిన వ్యవసాయ శాఖ అధికారులు
- పకడ్బందీగా వరద నష్టం అంచనాలు తయారీ
- కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ల మానిటరింగ్
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాను భారీ వర్షాలు, వరదలు నిండా ముంచాయి. అనేక చోట్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే జరిగిన పంట నష్టాన్ని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో దాదాపు 15 వేలకు పైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనాలు వేశారు. వ్యవసాయ శాఖ పరిధిలోని 12 వేల ఎకరాల్లో ఆయా పంటలు నష్టపోగా, ఉద్యానవన శాఖ పరిధిలో దాదాపు 4 వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు నిర్ధారించారు.
3,200 ఎకరాల్లో పత్తి, 3 వేల ఎకరాల్లో వరి, 2,600 ఎకరాల్లో సోయా, 2100 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా లెక్కగట్టారు. అలాగే 3000 ఎకరాల వరకు పసుపు పంట, 400 నుంచి 500 ఎకరాల వరకు కూరగాయల పంటలు నష్ట పోగా దాదాపు 400 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.
సర్వేను స్వయంగా పరిశీలించిన కలెక్టర్
జరిగిన నష్టాన్ని పకడ్బందీగా అంచనా వేసేందుకు జిల్లా స్పెషల్ ఆఫీసర్ హరికిరణ్తో పాటు కలె క్టర్ అభిలాష అభినవ్ రంగంలోకి దిగారు. నష్టం అంచనాల రూపకల్పనకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. దీంతో గురువారం ఉదయం నుండే ఆయా శాఖల అధికారులంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాస్తవ పరిస్థితులను పరిశీలించిన అంచనాలు రూపొందించడంలో నిమగ్నమయ్యారు. ఈ సర్వేను పలుచోట్ల కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
ఇంజనీరింగ్ శాఖలకు 20 కోట్ల మేర నష్టం
వరదలతో ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలకు భారీ నష్టం చేకూరింది. చాలా చోట్ల రోడ్లు ధ్వంసం కాగా మరికొన్ని చోట్ల వంతెనలు దెబ్బతిన్నాయి. పలు కాలువలు, చెరువులకు గండి పడ్డాయి. జిల్లాలో మొత్తం 40 చెరువులు, కెనాల్స్ దెబ్బతిన్నాయి. రిపేర్లకు దాదాపు రూ.8 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధి లో మొత్తం 30 రోడ్లు 122 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నట్లు సంబంధిత శాఖ అధికారులు తమ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.
ఇందుకు దాదాపు రూ.7 కోట్లు అవసరమవుతాయని అధికారులు చెప్తున్నారు. ఆర్ అండ్ బి శాఖ పరిధిలో మొత్తం 48 కల్వర్టులు ధ్వంసం కాగా, 150 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు వివరిస్తున్నారు. వీటి నష్టం రూ.3.5 కోట్లకు పైగా ఉంటుందని చెప్తున్నారు.