రజనీకాంత్ ను కలసిన శశికళ

రజనీకాంత్ ను కలసిన శశికళ
  • దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు అందుకున్న రజనీకాంత్ ను అభినందించిన శశికళ

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కొత్త మార్పులు చోటు చేసుకోబోతున్నాయా..? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ.. సూపర్ స్టార్ రజనీకాంత్ తో భేటీ కావడం సరికొత్త ఊహాగానాలకు తెరలేపింది. చెన్నై నగరంలోని పోయెస్ గార్డెన్ లో ఉన్న రజనీకాంత్ నివాసానికి వెళ్లిన శశికళ.. దాదాసాహెబ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. రజనీకాంత్ సతీమణి లలితతో కలసి కాసేపు ముచ్చటించినట్లు ఫోటోలు మీడియాకు విడుదల చేశారు. కేవలం మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని పేర్కొన్నారు. 

ఒకవైపు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాస్వామ్య పాలనకు అసలైన నిర్వచనంలా ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక నిర్ణయాలతో రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా అందరి హృదయాలను దోచుకుంటున్నారు. ప్రతిపక్ష అన్నాడీఎంకే నాయకులకు తగిన ప్రాధాన్యతనిస్తూనే.. స్టాలిన్ తనదైన ముద్ర వేసే ప్రయత్నాలు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.  మరోవైపు ఎన్నికల ముందు రాజకీయాలకు గుడ్ బై ప్రకటించి సైలెంట్ అయిన శశికళ.. కొద్ది రోజుల క్రితం క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టే దిశగా శశికళ ప్రయత్నాలు చేస్తుంటే.. ఆమె రాకను అడ్డుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, పన్నీర్ సెల్వం తదితరులు.

ఇటీవల పార్టీ ప్రక్షాళనలో భాగంగా పన్నీర్ సెల్వం పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించగా.. ఆయనకు డిప్యూటీగా పళనిస్వామి బాధ్యతలు చేపట్టి శశికళ రీఎంట్రీకి చెక్ పెట్టారు. ఈ నేపథ్యంలో శశికళ.. రజనీకాంత్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం మర్యాద పూర్వకంగానే అని చెబుతున్నప్పటికీ సరికొత్త రాజకీయ పరిణామాలకు నాంది అన్న ఊహాగానాలు చెలరేగాయి.