నంది కాదు.. ఇకపై గద్దర్ అవార్డులు ఇస్తం : సీఎం రేవంత్​రెడ్డి

నంది కాదు.. ఇకపై  గద్దర్ అవార్డులు ఇస్తం  :  సీఎం రేవంత్​రెడ్డి
  • కవులు, కళాకారులు, సినిమావాళ్లకు ఇస్తం 
  • ఓ జిల్లాకు గద్దర్​ పేరు, ట్యాంక్​బండ్​పై విగ్రహం: సీఎం
  • గద్దరన్నతో మాట్లాడితే వెయ్యేనుగుల బలం వచ్చేది
  • ఆ బలంతోనే కేసీఆర్​ గడీల గోడలు బద్దలు కొట్టినం
  • ఇది ప్రజాపాలన కాబట్టే కవిత కూడా స్వేచ్ఛగా వినతిపత్రం ఇస్తున్నరు
  • మూడు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతరని కొందరు పగటి కలలు కంటున్నరు
  • అలాంటి ఆలోచన చేస్తే ప్రజలే సజీవంగా గోరీ కడ్తరు
  • ఐదేండ్లు కాదు.. పదేండ్లు సుస్థిర పాలన అందిస్తమని వెల్లడి
  • రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్​ జయంతి

హైదరాబాద్, వెలుగు:  కవులు, కళాకారులు, సినిమావాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంది అవార్డులకు బదులు గద్దర్​ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. ఇదే శాసనమని, తన మాటే జీవో అని స్పష్టం చేశారు. తెలంగాణ లెజెండ్, బ్రాండ్​ అంబాసిడర్​ గద్దర్​ అని కొనియాడారు. వచ్చే ఏడాది గద్దర్​ జయంతి రోజు (జనవరి 31) నుంచే ఈ అవార్డులను అందజేస్తామని వెల్లడించారు. ఓ జిల్లాకు గద్దర్​ పేరు పెట్టేందుకు, హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​పై గద్దర్​ విగ్రహం ఏర్పాటు చేసేందుకు కేబినెట్​లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్​లోని రవీంద్రభారతిలో గద్దర్​ ఫౌండేషన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాగాయకుడు గద్దర్​ జయంతి సభ జరిగింది. ఈ సభకు సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. 

సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. ఇది ప్రజాస్వామిక ప్రభుత్వమని, ప్రజలెనుకున్న ప్రభుత్వమని, అందుకే గద్దరన్న జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించామని  చెప్పారు. ‘‘మొన్న సినీ ప్రముఖులు నన్ను కలవడానికి వచ్చి.. ఒకప్పుడు నంది అవార్డులు ఉండేవని, వాటిని పునరుద్ధరిస్తే బాగుంటుందని అన్నరు. నంది అవార్డులు కాదు.. మా ప్రభుత్వం అవార్డులు ఇస్తదని చెప్పిన. ఆ అవార్డుల పేరు గద్దర్​ అవార్డులు అని ఉంటదని చెప్పిన. తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్​ అవార్డులని పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుంటం. ఇదే శాసనం.. ఇదే జీవో.. నా మాటనే జీవో. నా సహచర మంత్రులు ఆమోదిస్తారని ఆశిస్తున్న” అని ప్రకటించారు. 

సినిమావాళ్లు గొప్ప అవకాశంగా భావించాలి

నంది అవార్డులకు బదులు గద్దర్​ పేరిట ఇచ్చే అవార్డులను సినిమావాళ్లు గొప్ప అవకాశంగా భావించాలని సీఎం సూచించారు. ‘‘వచ్చే ఏడాది జనవరి 31 తారీఖునాడు గద్దరన్న జయంతి రోజు నుంచి ఈ పురస్కారాలను కవులకు, కళాకారులకు అందిస్తం. దీని ద్వారా గద్దరన్నను స్మరించుకునే అవకాశం అందరికీ దక్కుతుంది. అందుకే ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నం.. తెలంగాణ లెజెండ్​, బ్రాండ్​ అంబాసిడర్​మా గద్దరన్న. సినిమావాళ్లు.. మీకు ఎవరికి పురస్కారం వచ్చినా గొప్ప అవకాశంగా భావించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్న” అని అన్నారు. స్టేజ్ పైనే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ  ధన్యవాదాలు తెలియజేశారు. 

నేను నిరాశలో ఉన్నప్పుడు గద్దరన్నను కలిసేది

సమాజాన్ని చైతన్యపరిచేందుకు గద్దరన్న గజ్జె కట్టి గళం విప్పారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జన సమితి, బెల్లి లలిత, గద్దర్ లాంటి వారు ఎందరో పోరాడారని తెలిపారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ మొన్నటివరకు కొందరు స్వార్థపరుల పాలైందని, పునాదులను మరిచి ఉద్యమకారులను అణచివేయాలని చూశారని మండిపడ్డారు. ‘‘తాను కాంక్షించిన తెలంగాణ రాలేదని గ్రహించిన గద్దరన్న..​ మళ్లీ తన అవసరం తెలంగాణ సమాజానికి ఉందని భావించి గొంగడి భుజం మీద వేసుకొని ప్రజలను చైతన్యవంతులను చేయడానికి బయలుదేరిండు. ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొన్నడు” అని తెలిపారు. తాను పోరాటంలో నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు గద్దరన్నను ఇంటికి వెళ్లి కలిసేవాడినని ఆయన గుర్తుచేసుకున్నారు. గద్దరన్నతో మాట్లాడితే వెయ్యేనుగుల బలం వచ్చేదని తెలిపారు. 

ఇది ప్రజాపాలన అని కవితకు తెలిసొచ్చింది

ఇది ప్రజా ప్రభుత్వం అని, ఎవరైనా వచ్చి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ ఉందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘దళితుడిని సీఎం చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ మోసం చేసిండు. కానీ, ఆ దళితుడ్నే ఇందిరమ్మ రాజ్యం అసెంబ్లీ స్పీకర్​గా నిర్ణయిస్తే.. ఆ స్పీకర్​కు కవిత వచ్చి పూలే విగ్రహ ఏర్పాటు కోసం వినతిపత్రం ఇచ్చింది. అంటే.. ప్రజాప్రభుత్వం వచ్చినట్టే.. ప్రజాపాలన మొదలైనట్టే. తండ్రి మీద నమ్మకం లేక.. ఇప్పుడు ధైర్యంగా ప్రజాపాలనలో స్వేచ్ఛగా కవిత వినతిపత్రం ఇచ్చింది. ఇంతకంటే ఏం కావాలి” అని చెప్పారు. 

ప్రజలే గోరీ కడ్తరు

సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకులు శపనార్థాలు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘కొంత మంది మాట్లాడుతున్నరు. మూడు నెలల్లోనో, ఆరునెలల్లోనో కేసీఆర్​ మళ్లా ముఖ్యమంత్రి ఐతడని అంటున్నరు. అట్ల ఆశపడెటోళ్లకు ఒక మాట చెప్పదల్చుకున్న. మొన్న ఎన్నికల్లో ప్రజలు బొక్కలిరగొట్టి బోర్లా పడేసిన్రు. మీ బొక్కలే సక్కగ కాలేదు. అట్లాంటిది ఏ రకంగా ముఖ్యమంత్రి అవుదామని పగటి కలలు కంటున్నరు. అట్లాంటి ఆలోచన చేస్తే బతికుండగానే   ప్రజలు గోరీ కడ్తరు” అని హెచ్చరించారు. బీఆర్​ఎస్​ వాళ్లు అక్కసుతో విమర్శలు చేస్తున్నారని, తాము అధికారంలో ఉండటమే వాళ్లకు శిక్ష అని ఆయన అన్నారు. ఐదు కాదు.. పదేండ్లు సుస్థిర పాలన ఇచ్చే బాధ్యత తమదని తెలిపారు. లిక్కర్​ పార్టీ, నిక్కర్​ పార్టీ కలిసి గత ఎన్నికల్లో కాంగ్రెస్​ను ఓడించాలని చూశాయని, కానీ ప్రజలు లిక్కర్​ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో నిక్కర్​ పార్టీకి కూడా బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.
 
నా పాదయాత్రకు పేరు పెట్టింది గద్దరే: భట్టి

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తేవాలని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసిన తన పాదయాత్రకు పీపుల్స్ మార్చ్ అని పేరు పెట్టింది గద్దర్ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గుర్తుచేసుకున్నారు. పాదయాత్రలో అడవి బిడ్డలను, అణగారిన వర్గాలను తన ఆట, మాట, పాట ద్వారా గద్దర్​ భాగస్వామ్యం చేశారని చెప్పారు. తనతో పాటు పాదయాత్ర చేసిన గద్దర్​తో విడదీయరాని బంధం ఉందని తెలిపారు. ‘‘చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినట్లు గొప్పలు చెప్పుకున్న కేసీఆర్​ కంటే ముందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాదయాత్ర చేసి ప్రజలను కదిలించిన మహా నాయకుడు గద్దర్” అని ఆయన అన్నారు. యావత్ సమాజాన్ని సంఘటితం చేసిన వ్యక్తి గద్దరని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే దానికి కారణం గద్దర్ పాట, ఆటేనని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్పవ్యక్తి గద్దర్​ అని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. కాగా, గద్దర్​ గురించి పాట పాడుతూ ఆయన కూతురు వెన్నెల ఎమోషన్​ అయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ సీనియర్​ నేత మధు యాష్కీ​, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, గద్దర్​ కుమారుడు సూర్య, కవులు, గాయకులు, కళాకారులు పాల్గొన్నారు.

కవిత ఫోన్​చేసి.. గాలం వేయాలనుకుంది: కంచ ఐలయ్య

కల్వకుంట్ల కవిత తనకు ఫోన్​ చేసి అసెంబ్లీలో మహాత్మ జ్యోతీబా పూలే విగ్రహ ఏర్పాటు కోసం సహకారం కోరారని ప్రొఫెసర్​ కంచ ఐలయ్య తెలిపారు. ‘‘ఓ రోజు నాకు ఫోన్​కాల్​ వచ్చింది. ఎవరూ అని అడిగితే.. కవితను అని చెప్పింది. ఏ కవిత అని అడిగిన. కేసీఆర్​ బిడ్డను అంది. మీరు రాంగ్​ నంబర్​కు ఫోన్​ చేసిన్రు అన్న. లేదు.. నేను కవితను.. పూలే విగ్రహ ఏర్పాటు కోసం మీ సహకారం కావాలి సార్​ అని చెప్పింది. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని పూలే విగ్రహం ఇప్పుడు వాళ్లకు గుర్తుకు వచ్చింది. నాకు గాలం వేయాలనుకుంది. నాకే కాదు.. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలకు కూడా గాలం వేస్తరేమో. జాగ్రత్తగా ఉండాలె” అని సూచించారు.  

కేసీఆర్​ క్రిమినల్​ పొలిటీషియన్​

‘‘క్రిమినల్​తో పోట్లాడొచ్చు, పొలిటీషియన్​ తో పోట్లాడొచ్చు.. కానీ, క్రిమినల్​ పొలిటీషియన్​తో పోట్లాడుడు ప్రమాదకరమని గద్దరన్న అంటుండె. కేసీఆర్​ క్రిమినల్​ పొలిటీషియన్​ అని గద్దరన్న నాతో చెప్తుండె. మీ అందరి సహకారంతో కేసీఆర్​ను గద్దె దించినం. ప్రజా పాలన తెచ్చుకున్నం” అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.  గద్దర్​ ఇచ్చిన స్ఫూర్తి, బలంతోనే ప్రగతిభవన్ గోడలు బద్దలు కొట్టి, మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్​గా పేరు పెట్టుకున్నామని తెలిపారు.