బాధిత మహిళలకు భరోసా ఏది..సఖి కేంద్రంలో పూర్తి స్థాయి సేవలందడం లేదు

బాధిత మహిళలకు  భరోసా ఏది..సఖి కేంద్రంలో పూర్తి స్థాయి సేవలందడం లేదు

గద్వాల, వెలుగు:గద్వాలలోని సఖి కేంద్రం బాధిత మహిళలకు భరోసా ఇవ్వలేకపోతోంది. వేధింపులు, అత్యాచారాలు, చైల్డ్ మ్యారేజ్  బాధితులైన బాలికలు, మహిళలను అక్కున చేర్చుకుని భరోసా ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన సఖి కేంద్రంలో పూర్తి స్థాయి సేవలందడం లేదు. గతంలో ఇందిరా ప్రియదర్శిని ఎన్జీవో ఆధ్వర్యంలో నడుస్తున్న సమయంలో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించడంతో కలెక్టర్  సీరియస్  అయి వారిని తొలగించారు. ఉమెన్  అండ్  చైల్డ్  వెల్ఫేర్  డిపార్ట్​మెంట్  వారికి సఖి సెంటర్  నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఇన్​చార్జీ ఉద్యోగుల కారణంగా తమకు పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదని బాధితులు వాపోతున్నారు. పారా మెడికల్ ఆఫీసర్  లేకపోవడంతో కౌన్సిలింగ్  ఇవ్వడం లేదు. సోషల్  కౌన్సిలర్ లేకపోవడంతో బాధిత మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. వేటు పడ్డ సిబ్బంది స్థానంలో కొత్తవారిని తీసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చినా ఇంటర్వ్యూల ఊసే లేదు. తమ వారినే తీసుకోవాలని అధికార పార్టీ లీడర్లు పట్టుబడుతున్నడంతో ఇంటర్వ్యూలను వాయిదా వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సఖి సెంటర్​లో జల్సాలు, 14 మందిపై వేటు

సఖి సెంటర్ లోకి వేరే వ్యక్తులకు ప్రవేశం ఉండదు. బాధితులు, సిబ్బంది వంటి వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఎవరైనా సెంటర్​కి వస్తే రిజిస్టర్ లో తప్పనిసరిగా ఎందుకోసం వచ్చారనే విషయాన్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి రూల్స్ బ్రేక్  చేస్తూ సెంటర్ లో ఏకంగా పెళ్లి రోజు ఉందని అక్కడి ఉద్యోగి ఒకరు పార్టీ చేసుకున్నారు. విషయం బయటకి రావడంతో 3 నెలల కింద అక్కడ పని చేసే 14 మంది సిబ్బందిపై కలెక్టర్  వేటు వేశారు. సఖి సెంటర్  నిర్వాహణ చూసుకుంటున్న ఇందిరా ప్రియదర్శిని ఎన్జీవోను కూడా బాధ్యతల నుంచి తప్పించారు.

సేవలు అందుతలే..

బాధితులకు సఖి సెంటర్ లో వైద్య సేవలు, కౌన్సిలింగ్, పోలీస్, న్యాయ సహాయం, తాత్కాలిక వసతి అందించాల్సి ఉంటుంది. 14 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా, సిఫ్ట్ ల వారీగా ఆరుగురు డ్యూటీలు చేస్తున్నారు. మామూలు కేసులు వస్తే ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బంది సాయం చేస్తున్నారు. సీరియస్ కేసులు వస్తే సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. బాధిత మహిళలను ఎలా హ్యాండిల్​ చేయాలి, వారికి ఏ విధమైన సాయం అందించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. పాత ఎన్జీవోను తొలగించాక ఎస్వీకే స్వచ్ఛంద సంస్థకు బాధ్యతలు ఇచ్చినప్పటికీ, వారు కూడా సెంటర్ ను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

ఇంటర్వ్యూలు వాయిదా..

సఖి సెంటర్ నిర్వహణ చూస్తున్న ఎన్జీవోను తొలగించాక నాగర్ కర్నూల్ కి చెందిన ఎస్వీకే(శ్రామిక వికాస కేంద్రం)కు బాధ్యతలు ఇచ్చారు. వాళ్లు వచ్చాక సఖి సెంటర్ లో పని చేసేందుకు సెంటర్  అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, సైకో సోషల్  కౌన్సిలర్, లీగల్  కౌన్సిలర్ పారామెడికల్ వర్కర్, ఐటీ అసిస్టెంట్  పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 1న ఇంటర్వ్యూ ఉందని చెప్పి రద్దు చేశారు. తమకు అనుకూలమైన వారిని నియమించేందుకే కొందరు తెర వెనక చక్రం తిప్పి ఇంటర్వ్యూను నిలిపివేశారనే విమర్శలున్నాయి. తొలగించిన 14 మందిలో కొందరిని తిరిగి మళ్లీ విధుల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో కొత్త, పాత ఎన్జీవోల నిర్వాహకులు కలిసి సెంటర్ ను పట్టించుకోవడం లేదనే ఆరోపణలన్నాయి. కొత్త ఎన్జీవోకు బాధ్యతలు అప్పగించినా, సంస్థ సిబ్బంది డ్యూటీలు చేయకపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది.

ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం..

సఖి సెంటర్ కు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. సీరియస్  కేసులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ఉన్న సిబ్బందితోనే పని చేస్తున్నాం. త్వరలోనే సిబ్బందిని నియమిస్తారు.
- నర్సింలు, డీసీసీవో, గద్వాల