యూకే (బ్రిటన్)లో జరిగిన ‘గూమింగ్ గ్యాంగ్స్’ (పిల్లలను మభ్యపెట్టి లైంగికంగా వాడుకునే ముఠాలు) కుంభకోణం గురించి బ్రిటిష్ ఎంపీ రూపెర్ట్ లోవ్ పార్లమెంట్‌లో సంచలన విషయాలను వెల్లడించారు. బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడైన రూపెర్ట్ లోవ్, బాధితులు స్వయంగా చెప్పిన భయంకరమైన విషయాలను పార్లమెంట్‌లో చదివి వినిపించారు. ఈ క్రూరమైన అత్యాచార ముఠాలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
గత ఏడాది ఆయన నేతృత్వంలో జరిగిన ఒక ప్రైవేట్ దర్యాప్తులో, బ్రిటన్ వ్యాప్తంగా కనీసం 85 ప్రాంతాలలో ఇలాంటి బాలల లైంగిక దోపిడీ ముఠాలు ఉన్నట్లు తేలింది. ఈ ముఠాలలో ఎక్కువ మంది పాకిస్తానీ మూలాలున్న పురుషులు ఉన్నారని... ప్రభుత్వ అధికారులు, పోలీసులు, సామాజిక కార్యకర్తలు చిన్న పిల్లలను రక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
బాధితులు చెప్పిన భయంకరమైన నిజాలు
ఎంపీ రూపెర్ట్ లోవ్ పార్లమెంట్‌లో చదివిన కొన్ని సాక్ష్యాలు వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఒక మహిళ మాట్లాడుతూ.. తనకు 12 ఏళ్ల వయసున్నప్పుడు ఒకరు తనపై అత్యాచారం చేయడమే కాకుండా, పగిలిన మద్యం సీసాతో తనను తీవ్రంగా హింసించాడని కన్నీరు పెట్టుకుంది. మరో బాధితురాలు తనకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండి మూడేళ్ల కాలంలో సుమారు 600 నుండి 700 మంది పురుషులు తనపై అత్యాచారం చేశారని తెలిపింది.
బాధితులు శ్వేతజాతీయులు, క్రైస్తవులు కావడంతో వారిని మరింత అవమానించడానికి నేరస్థులు వారి మతాన్ని, నమ్మకాలను ఎగతాళి చేస్తూ మానసికంగా దెబ్బతీశారు. రక్షించాల్సిన కొందరు పోలీసు అధికారులు కూడా తనపై అత్యాచారం చేశారని ఒక మహిళ ఘోరమైన నిజాన్ని బయటపెట్టింది.
తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ 15 ఏళ్ల బాలిక ఆసుపత్రికి వెళ్తే, నిజం చెప్పడానికి భయపడి తనకు డ్రింక్ లో ఏదో కలిపారని చెప్పినా.. ఆసుపత్రి సిబ్బంది ఎలాంటి ప్రశ్నలు అడగకుండా కేవలం టాబ్లెట్లు ఇచ్చి పంపించేశారు. కొందరు పురుషులు మహిళలను బోనుల్లో బంధించి, నవ్వుకుంటూ వీడియోలు తీస్తూ, జంతువులతో (కుక్కతో) కూడా అత్యాచారం చేయించి పందాలు కాశారని ఒక మహిళ ఇచ్చిన సాక్ష్యాన్ని పేర్కొంది.
అసలు ఏంటీ 'గూమింగ్ గ్యాంగ్స్'
యునైటెడ్ కింగ్‌డమ్ (UK) లో ఏకాకిగా ఉండే లేదా పేదరికంలో ఉన్న చిన్న పిల్లలను ముఖ్యంగా 11 నుండి 16 ఏళ్ల బాలికలను టార్గెట్ చేసి, వారికి మద్యం, డ్రగ్స్ అలవాటు చేసి, ప్రేమగా నటిస్తూ లొంగదీసుకుని, ఆపై ముఠాలుగా అత్యాచారాలకు పాల్పడేవారిని 'గూమింగ్ గ్యాంగ్స్' అంటారు.
బ్రిటన్‌లోని రోథర్‌హామ్, రోచ్‌డేల్, ఓల్డ్‌హామ్ వంటి ఎన్నో పట్టణాలలో దశాబ్దాలుగా ఈ దారుణాలు సాగుతున్నాయి. 2002 లోనే ఆన్ క్రైయర్ అనే మహిళా ఎంపీ దీనిపై హెచ్చరించారు. ఆ తర్వాత జరిగిన దర్యాప్తుల్లో బ్రిటీష్-పాకిస్తానీ ముఠాల దారుణాలు బయటపడ్డాయి. అయినప్పటికీ పోలీసులు, స్థానిక కౌన్సిళ్లు ఓటు బ్యాంకు రాజకీయాలవల్లో లేదా భయంవల్లో సరైన చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి.
చివరగా ఎంపీ రూపెర్ట్ లోవ్ మాట్లాడుతూ.. కేవలం మాటలు సరిపోవు, చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో రానున్న మా దర్యాప్తు నివేదిక బ్రిటన్‌ను శాశ్వతంగా మార్చేస్తుంది అని స్పష్టం చేశారు.
