
- గ్రేటర్ సిటీలో కీలకమైన హనుమకొండ బస్టాండ్
- చుట్టూ ఉన్న హోటళ్లు, బార్లు, హాస్పిటళ్లతో ట్రాఫిక్ సమస్యలు
- ఫుట్ పాత్ లు ఆక్రమించడంతో పాదచారులకూ ఇబ్బంది
- లైట్ తీసుకుంటున్న ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజా రవాణాకు కేంద్రంగా నిలిచే హనుమకొండ బస్టాండ్ ట్రాఫిక్ చిక్కులకు అడ్డాగా మారింది. ఇతర రాష్ట్రాలు, పట్టణాలకు వెళ్లేందుకు ఉమ్మడి జిల్లాకు హనుమకొండ బస్టాండే పెద్ద దిక్కు కాగా, ఈ బస్టాండ్ లోకి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా ట్రాఫిక్చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోంది.'కుడా' కాంప్లెక్స్ నుంచి అలంకార్ వైపున్న హనుమాన్ టెంపుల్ వరకు అర నిమిషంలో వెళ్లే దూరానికి ట్రాఫిక్ లో గంటల తరబడి ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
సగం రోడ్డు పార్కింగ్ కే..
ఉమ్మడి జిల్లాలో హనుమకొండ బస్టాండే అతి పెద్దది. ఇక్కడి నుంచి నిత్యం వివిధ రాష్ట్రాలు, పట్టణాలకు సుమారు 1,200కుపైగా బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రయాణికుల కోసం వందల సంఖ్యలో ఆటోలు కూడా బస్టాండ్ చుట్టే తిరుగుతుంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా బస్టాండ్ వెనుక వైపు ఉన్న హోటళ్లు, లాడ్జీలు, బార్లు, హాస్పిటళ్లు, ఇతర షాపుల నిర్వాహకులు తమ వద్దకు వచ్చే బండ్లన్నింటినీ రోడ్డు మధ్య వరకు పార్క్ చేసి పెడుతున్నారు.
దీంతో సగం రోడ్డును ఆ వాహనాలే ఆక్రమిస్తున్నాయి. బస్టాండ్ వద్ద ప్రయాణికుల కోసం వచ్చిన ఆటోలు, కార్లను కూడా రోడ్డు మధ్యలోనే పెట్టి ఉంచుతున్నారు. ఫలితంగా దారి ఇరుకుగా మారి బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బస్టాండ్‌నుంచి హైదరాబాద్ కు వెళ్లే ప్రైవేటు కార్లను 'కుడా' కాంప్లెక్స్ ఎదురుగా నడిరోడ్డుపైనే నిలిపి ఉంచడంతో అక్కడా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు వాహనదారులు, ప్రయాణికులు చుక్కలు చూడాల్సి వచ్చింది.
ఫుట్ పాత్ లన్నీ ఆక్రమణలోనే..
బస్టాండ్ సమీపంలోని కుడా కాంప్లెక్స్ జంక్షన్ నుంచి పద్మాక్షి, అలంకార్ వైపు వెళ్లే మార్గంలో ఉన్న బిల్డింగుల ఓనర్లు ఫుట్ పాత్ లను ఆక్రమించేశారు. వాకర్స్ కోసం కేటాయించిన స్థలాన్ని బిజినెస్ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. కొందరు వాహనాల పార్కింగ్‌కు, మరికొందరు వాటిపైనే షాప్‌లను నడిపిస్తున్నారు. దీంతోనే బస్టాండ్ సమీపంలో చూద్దామన్నా ఫుట్ పాత్ లు కనిపించని పరిస్థితి నెలకొంది. ఇదిలాఉంటే గతంలో ఈ మార్గంలో రోడ్డు ఇరుకుగా ఉంటే మూడేండ్ల కిందటే దానిని విస్తరించి, మళ్లీ ఫుట్ పాత్ లు ఏర్పాటు చేశారు. అయినా హోటళ్లు, బార్లు, హాస్పిటళ్ల తీరు మార్చుకోకపోవడం ఇబ్బందులు తప్పడం లేదు.
లైట్ తీసుకుంటున్న ఆఫీసర్లు..
హనుమకొండ బస్టాండ్ జంక్షన్ నుంచి హనుమాన్ గుడి వరకు ఫుట్పాత్లన్నీ ఆక్రమణకు గురైనా జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారు. ఆటోలు, కార్లు, ఇతర వెహికల్స్ వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తినా పోలీస్ సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, అక్కడున్న హోటల్స్, హాస్పిటల్స్, బార్స్, ఇతర షాపులు జీడబ్ల్యూఎంసీ, పోలీస్ సిబ్బందిని మేనేజ్ చేసుకుంటూ దందా సాగిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఫుట్ పాత్లపై ఆక్రమణలు తొలగించి, హనుమకొండ బస్టాండ్‌వద్ద ట్రాఫిక్సమస్యలు తలెత్తకుండా ఆఫీసర్లు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.