
హనుమకొండ సిటీ, వెలుగు: ఇందిరా సౌర గిరి జలవికాసం పథకానికి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఇందిరా సౌర గిరి జల వికాసం పథకంపై ఐటీడీఏ, అగ్రికల్చర్, ఉద్యానవన, డీఆర్డీఏ, ఫారెస్ట్ ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ పథకం ద్వారా 2.20 ఎకరాల భూమి కలిగిన గిరిజన రైతులకు రూ.6 లక్షలతో బోరు, పంపుసెట్టు, 5 లేదా 7.5 హార్స్ పవర్ మోటరు, పైపులు, సోలార్ ప్లేట్స్ ఉచితంగా అందజేస్తున్నట్లు ఆఫీసర్లు తెలిపారు.
జిల్లాలో 2025-26 కి 64 మంది లబ్ధిదారులకు చెందిన 58 ఎకరాల పోడు భూములకు మంజూరు చేసినట్లు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకానికి లబ్ధిదారులను మండల స్థాయి కమిటీలు ఎంపిక చేసి, కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా కమిటీకి పంపించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీటీడీవో ప్రేమకళ, డీఆర్డీవో మేన శ్రీను, ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు.
అనంతరం ఆమె జేఎన్ఎస్ ను పరిశీలించి, డీవైఎస్వో గుగులోతు అశోక్ కుమార్ జేఎన్ ఎస్ లో వసతి సౌకర్యాలను కలెక్టర్ కు వివరించారు. అనంతరం అథ్లెటిక్ ట్రాక్, బాలబాలికల హాస్టల్ గదులను కలెక్టర్ తనిఖీ చేశారు. జేఎన్ఎస్ లో త్వరలో ఏర్పాటు చేసే తాత్కాలిక స్పోర్ట్స్ స్కూల్ కు సంబంధించిన ఏర్పాట్లపై డీవైఎస్వోను ఆరా తీశారు. కాగా, భారీ వర్షాల దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం హనుమకొండ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. ప్రజలు ఏదైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1115 ను సంప్రదించాలని సూచించారు.