ఐపీఎల్ ఆడాలని ఉంది.. అవకాశం వస్తే వదులుకోను: పాక్ స్టార్ పేసర్

ఐపీఎల్ ఆడాలని ఉంది.. అవకాశం వస్తే వదులుకోను: పాక్ స్టార్ పేసర్

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లో అతి పెద్ద లీగ్ అంటే అందరికీ ముందుగానే ఐపీఎల్ గుర్తుకొస్తుంది. ఎన్ని లీగ్ లు ఉన్నా ఐపీఎల్ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఐపీఎల్ వస్తుందంటే చాలు దేశమంతా సందడి వాతావరణం నెలకొంటుంది. 2008 నుంచి ఇప్పటివరకు విజయవంతంగా కొనసాగుతున్న ఈ మెగా టోర్నీ ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. ప్రతి ఒక్క ప్లేయర్ ఐపీఎల్ ఆడి  నిరూపించుకోవాలని ఆరాటపడతారు. పాక్ ప్లేయర్లు దీనికి మినహాయింపేమీ కాదు. తాజాగా పాక్ పేసర్ హాసన్ అలీ తనకు ఐపీఎల్ ఆడాలని ఉందని తెలియజేశాడు. 
        
పాకిస్థాన్ లోని లోకల్ ఛానల్ తో హసన్ అలీ మాట్లాడుతూ "ఐపీఎల్ ప్రపంచంలోనే అతి పెద్ద లీగ్. ఈ మెగా టోర్నీలో ఆడేందుకు ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదరు చూస్తారు. అవకాశం వస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను". అని హాసన్ అలీ చెప్పుకొచ్చాడు. పాక్ ప్లేయర్లు షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్, షోయబ్ మాలిక్, సల్మాన్ బట్, యూనిస్ ఖాన్, సోహైల్ తన్వీర్ లు 2008 ప్రారంభ ఐపీఎల్  సీజన్ లో ఆడారు. 2008 ముంబైలో జరిగిన ఉగ్రదాడి కారణంగా పాక్ ప్లేయర్లు ఈ టోర్నీ నుంచి నిషేధించబడ్డారు. భారత ప్రభుత్వం BCCI పాక్ ప్లేయర్లను ఐపీఎల్ లో చేర్చుకునే అవకాశాలు దాదాపుగా లేనట్టుగానే కనిపిస్తున్నాయి. 

ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో పాక్ 9 మ్యాచ్ ల్లో 4 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. హసన్ అలీ  6 మ్యాచ్ ల్లో 35.66 సగటుతో 9 వికెట్లు తీసాడు. యువ పేసర్ నజీమ్ షా గాయపడడంతో వరల్డ్ కప్ లో అనూహ్యంగా చోటు దక్కించుకున్న ఈ పాక్ పేసర్ పర్వాలేదనిపించాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు హసన్ అలీ ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. వరల్డ్ క ప్ తర్వాత పాక్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. ప్రపంచకప్ పరాజయం తర్వాత బాబర్ ఆజం కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. షాన్ మసూద్ కొత్త టెస్టు కెప్టెన్ గా ఎంపికయ్యాడు.