
- ఎర్రగా మారుతున్న పత్తి, నేలకొరుగుతున్న వరి చేలు
- దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోతున్న రైతులు
మహబూబ్నగర్/చిన్నచింతకుంట, వెలుగు: ఖరీఫ్ పంటలకు కష్టకాలం వచ్చింది. సెప్టెంబర్ నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. పత్తి, వరి పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు పడడంతో రైతులు నష్టపోతున్నారు. పంటల సాగు కోసం పెట్టిన ఖర్చులు కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరో రెండు, మూడు రోజుల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
పత్తిని ఆరబెట్టుకుంటున్న రైతులు..
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేపట్టారు. చిన్నచింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల, మరికల్, నర్వ, మాగనూరు, కృష్ణ, ఊట్కూరు, దామరగిద్ద, హన్వాడ, కోయిల్కొండ, మిడ్జిల్, మహబూబ్నగర్, అడ్డాకుల, మూసాపేట ప్రాంతాల్లోని పత్తి చేలల్లో మూడు వారాల నుంచి పత్తి రావడం మొదలైంది. అయితే పత్తి ఏరేందుకు కూలీల కొరత ఉండడంతో చాలా మంది రైతులు పత్తి తీయకుండా అలాగే ఉంచారు. గత నెల 24 నుంచి రోజు విడిచి రోజు.. వారం రోజుల నుంచి ప్రతి రోజూ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీని ప్రభావం చేతికొచ్చిన పత్తి పంటపై పడింది. వర్షాలకు నీళ్లు చేలల్లో నిలిచి మొక్కలకు వైరస్ సోకుతోంది. కొన్ని ఏరియాల్లో మొక్కలు ఎండిపోయాయి.
పంట చేతికొచ్చిన చోట పత్తి మొత్తం వర్షానికి తడిసి రాలిపోతోంది. కాయలోని పత్తి నల్లబారుతోంది. దీంతో కొన్ని చోట్ల రైతులు పత్తి ఏరి రోడ్లపై ఆరబోస్తున్నారు. అయినా రంగు మారుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. పంటను అమ్మకానికి తీసుకుపోతే సరైన మద్దతు ధర వస్తుందా? లేదా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేలల్లో పెట్టుబడులు పెట్టగా.. గిట్టుబాటు ధర రాకుంటే అప్పులే మిగుతాయని ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు భయపడి గత్యంతరం లేక కొందరు రైతులు చెట్ల నుంచి తీసిన పత్తిని ప్రైవేట్లో అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.8,200 ఉండగా.. రూ.2 వేల నుంచి రూ.వెయ్యి తక్కువకు ప్రైవేట్లో అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారు. సకాలంలో సీసీఐ సెంటర్లను కూడా ఓపెన్ చేయకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది.
ఈయన పేరు బీచుపల్లి. కౌకుంట్ల మండలం పుట్టపల్లి గ్రామం. ఈయనకు రెండెకరాల భూమి ఉంది. ఇది కాకుండా మరో 11 ఎకరాలు కౌలుకు తీసుకొని 13 ఎకరాల్లో పత్తి వేశాడు. ఎకరాకు దాదాపు రూ.30 వేల చొప్పున రూ.4 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం చెట్లకు కాయ పట్టగా.. చెట్టు నుంచి పత్తిని తీసే సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పత్తి మొత్తం నల్లగా మారింది. చేసేది లేక ఉన్న పత్తిని ఏరి రోడ్డుపై ఆరబోసుకుంటున్నాడు. పత్తి నల్లగా మారడంతో మద్దతు ధర వస్తదో.. రాదోనని ఆందోళన చెందుతున్నాడు.
ఈ ఫొటోలో కనిపిస్తున్నది నారాయణపేట జిల్లా మరికల్ గ్రామానికి చెందిన తిరుపతయ్య చేను. ఈయనకు మూడెకరాల భూమి ఉండగా, పత్తి వేశాడు. ఎకరాకు రూ.30 చొప్పున దాదాపు రూ.లక్ష వరకు ఖర్చు చేశాడు. నెల రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఎకరాకు రెండు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో అప్పులు మీద పడతాయని ఆందోళన చెందుతున్నాడు.
వరి దిగుబడి డౌటే..
వరి రైతుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఈ ఏడాది రెండు జిల్లాల్లో కలిపి 3.40 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అయితే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాలు పంటకు మేలు చేసినా.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంట దెబ్బతింటోంది. చాలా చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షానికి పంట నేలకొరిగింది. దీంతో రైతులు చేసేది లేక నేలకొరిగిన వరి పైరును నిలబెట్టే పనిలో ఉన్నారు. వరి దంట్లను కలిపి కడుతున్నారు. అయితే పంట నేలకొరగడంతో దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం వరి కంకి దశకు చేరుకోగా.. వర్షానికి కంకులు దెబ్బతింటున్నాయి. కంకి పాలుపోసే దశలో ఉన్ని కొన్ని చోట్ల పైరు నేలకొరగడంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది.