ఆపరేషన్ కగార్ పేరుతో కమ్యూనిస్టులను అణచివేసే కుట్ర : హేమంతరావు

ఆపరేషన్ కగార్ పేరుతో కమ్యూనిస్టులను అణచివేసే కుట్ర : హేమంతరావు
  • సీపీఐ జిల్లా మహాసభల ముగింపులో పార్టీ రాష్ట్ర కమిటీ బాధ్యుడు భాగం హేమంతరావు 

అశ్వారావుపేట, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో కమ్యూనిస్టులను అణచివేసేందుకు కుట్ర చేస్తుందని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు భాగం హేమంతరావు అన్నారు. పట్టణంలోని భద్రాచలం రోడ్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం సీపీఐ జిల్లా మహాసభ ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బులిచ్చే అదానీ, అంబానీలకు దేశ సంపదను కారు చౌకగా కట్టబెడుతున్నారని విమర్శించారు.

 ప్రశ్నించే శక్తులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మేధావులు కవులు, కళాకారులపై కత్తి కడుతున్నారన్నారు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టులపై పగబట్టి అణిచివేయాలని కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక అంతరాలను సృష్టిస్తున్న బీజేపీ  విధానాలు చాలా ప్రమాదం అని తెలిపారు. బీజేపీ బిహార్ ఎన్నికల సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్​ రివిజన్ పేరిట సుమారు 60 లక్షల ఓట్లను తొలగించారని, మహారాష్ట్రలో గెలిచేందుకు కొత్త ఓట్లను చేర్చారని కేంద్ర ఎన్నికల సంఘం సైతం బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని ఆరోపించారు.

సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ప్రతి ఎకరానికీ నీరందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.    స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచించాలని కేడర్ కు పిలుపునిచ్చారు. అనంతరం సీపీఐ భద్రాద్రికొత్తగూడెం జిల్లా నూతన కౌన్సిల్​ణు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా నూతన కార్యదర్శిగా షాబీర్ పాషాను   ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయోధ్య, ముత్యాల విశ్వనాథం, కల్లూరు వెంకటేశ్వరరావు, సలీం, ఏపీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండీ మునీర్, దారయ్య, తదితరులు  పాల్గొన్నారు.