ఆర్ అండ్ బీ కే హైకోర్టు కొత్త బిల్డింగ్ బాధ్యతలు

ఆర్ అండ్ బీ కే హైకోర్టు కొత్త బిల్డింగ్  బాధ్యతలు
  •  త్వరలో వివరాలు ఇవ్వనున్న సీజే 
  • ఆర్కిటెక్ట్ ను సెలెక్ట్ చేసి డిజైన్లు ఆహ్వానించనున్న సర్కారు
  • రాజేంద్రనగర్ లో 100 ఎకరాల్లో రూ.1200 కోట్లతో నిర్మాణం

హైదరాబాద్, వెలుగు: కొత్త హైకోర్టు నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించింది. హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ లోని హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలను ప్రభుత్వం  కేటాయించింది. ఇటీవల ఈ భవన నిర్మాణానికి బుధవారం సుప్రీంకోర్టు చీఫ్  జస్టిస్  డీవై చంద్రచూడ్  శంకుస్థాపన చేశారు. హైకోర్టును సుమారు రూ.1200 కోట్ల వ్యయంతో ఏడాదిన్నర టైమ్ లో పూర్తి చేసేలా ప్లాన్  చేస్తున్నారు. డిజైన్  ఖరారైన తరువాత ఆ ప్లాన్ ను, బడ్జెట్  అంచనా వ్యయాన్ని ప్రభుత్వానికి అధికారులు అందజేస్తారు. 

ఆ తర్వాత ప్రభుత్వం నిధులు సాంక్షన్  చేస్తుంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్  అమల్లో ఉండడం, హైకోర్టుకు త్వరలో సమ్మర్  హాలిడేస్  రానున్న నేపథ్యంలో జూన్ లో ఈ ప్రాజెక్టు డిజైన్, ఇతర పనులు వేగం కానున్నాయని అధికారులు చెబుతున్నారు. కొత్త హైకోర్టులో ఉండాల్సిన కోర్టు హాల్స్, క్యాంటీన్, అడ్వొకేట్ల రూమ్స్, సీజే, జడ్జీల క్వార్టర్లపై చీఫ్  జస్టిస్  ఆధ్వర్యంలో నలుగురు జడ్జిల బిల్డింగ్  కమిటీ ప్లాన్  రెడీ చేస్తుందని అధికారులు తెలిపారు. 

ప్లాన్ రెడీ చేసి ఆర్ అండ్ బీకి సమర్పించిన తరువాత హైకోర్టు డిజైన్ ను రెడీ చేసేందుకు ఆర్కిటెక్ట్ లను ఆర్ అండ్ బీ ఆహ్వానించనుంది. ఆర్కిటెక్ట్ ను ఫైనల్ చేసిన తరువాత సీజే అందించిన ప్లాన్ ను ఆర్కిటెక్ట్ కు అందిస్తారు. డిజైన్  రెడీ చేశాక చీఫ్ జస్టిస్ తో పాటు జడ్జిల బిల్డింగ్  కమిటీ ముందు ప్రజంటేషన్  ఇవ్వాల్సి ఉంటుంది. తరువాత ఫైనల్ డిజైన్ ను సెలెక్ట్  చేయనున్నారు. 

10 ఏండ్లుగా ఎన్నో నిర్మాణాలు

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయి. వాటిలో ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, సెక్రటేరియెట్  అమరవీరుల స్తూపం, అంబేద్కర్  విగ్రహం, ప్రగతి భవన్, కమాండ్  కంట్రోల్  బిల్డింగ్  నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం వరంగల్ లో సూపర్  స్పెషాలిటీ హాస్సిటల్ తో పాటు హైదరాబాద్ లో మూడు చోట్ల టిమ్స్ హాస్పిటల్స్, జిల్లాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణాలు, నిమ్స్  విస్తరణ బిల్డింగ్  నిర్మాణం జరుగుతోంది. తాజాగా హైకోర్టు నిర్మాణం కూడా ఆర్ అండ్ బీ కే ప్రభుత్వం అప్పగించింది. వచ్చే ఏడాది చివరి నాటికి కొత్త హైకోర్టు బిల్డింగ్  పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు.