
- ఉమ్మడి జిల్లాలో ఒక జడ్పీటీసీ, 16 ఎంపీటీసీ స్థానానికి నామినేషన్లు
- హైకోర్టు స్టేతో నిలిచిన ఎన్నికల ప్రక్రియ, నిరాశలో ఆశావహులు
- తీర్పుతో రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు
ఆదిలాబాద్, వెలుగు: ఉదయం నోటిఫికేషన్లు.. మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ.. సాయంత్రం ఎన్నికలకు బ్రేక్.. ఇదీ స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఎపిసోడ్. ఎన్నో ఆశలతో ఎన్నికలకు సిద్ధమై.. నామినేషన్లు వేసిన అభ్యర్థులకు సాయంత్రానికి హైకోర్టు తీర్పు షాక్ ఇచ్చింది. ఉదయమే ఉమ్మడి ఆదిలాబాద్ కలెక్టర్లు తొలి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు.
అన్ని ఎంపీడీవో కార్యాలయాలో అధికారులు ఏర్పాట్లు చేసి నామినేషన్ పత్రాలను అభ్యర్థులకు అందించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక జడ్పీటీసీ, 16 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి.
ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పుతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతోఈ తీర్పు పట్ల రాజకీయ పార్టీల నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ రాజకీయ డ్రామా చేసిందని, న్యాయబద్ధమైన వాటా కోసం బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. అటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న సైతం స్పందించారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం చేస్తోందని, రాజకీయ లబ్ధిపొందేందుకు ప్రజలను మభ్యపెడుడుతోందని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆరు వారాల తర్వాత మళ్లీ హైకోర్టు విచారణ చేపట్టనుండటంతో ఆశవాహులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
తొలి విడతలో 36 జడ్పీటీసీ, 288 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడతలో 36 జడ్పీటీసీ, 288 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఉదయం కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా ఆయా మండలాల్లోని అధికారులకు ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పత్రాలు తీసుకున్న అభ్యర్థులు.. కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వత్రంత్రులు పలువురు మధ్యాహ్నం వరకు నామినేషన్లు వేశారు.
ఇక ప్రచారమే తరువాయి అని భావించారు. కాగా 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో వారి ఆశలు ఆవిరైపోయాయి. గత నెల రోజులుగా ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక చేయడంలో తలమునకలు కాగా.. అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో బిజిబిజీగా గడిపి సమయాన్ని మొత్తం ఎన్నికల కోసమే కేటాయించింది. తాజాగా హైకోర్టు స్టే విధించడంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
ఉమ్మడి జిల్లాలో నామినేషన్లు దాఖలు
ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి జడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థిగా సిడం గణపతి నామినేషన్ దాఖలు చేశారు. జిల్లాలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాగా ఇందులో 8 కాంగ్రెస్, ఒకటి ఇండిపెండెంట్ అభ్యర్థి దాఖలు చేశారు.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 5 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేశారు. పెంబి ఎంపీటీసీ స్థానానికి రెండు, మందపల్లి, షెట్పల్లి స్థానానికి ఒక్కోటి, మామడ మండలంలోని వాస్తవాపూర్ స్థానానికి ఒక నామినేషన్ దాఖలైంది.
ఆదిలాబాద్ జిల్లాలో బజార్ హత్నూర్ ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ నుంచి సూర్యవంశీ పాండురంగ్ నామినేషన్ పత్రం సమర్పించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, జల్క్ పాండురంగ్, పార్టీ శ్రేణులు ఉన్నారు.
మంచిర్యాల జిల్లాలో కోటపల్లి మండలంలోని షెట్పల్లి ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ నుంచి ఎండీ మలేక బేగం దాఖలు చేశారు.
ఉమ్మడి జిల్లాలో మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేసిన స్థానాలు
జిల్లా జడ్పీటీసీ ఎంపీటీసీ
ఆదిలాబాద్ 10 80
నిర్మల్ 09 75
ఆసిఫాబాద్ 08 71
మంచిర్యాల 09 62