హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జీవో 317 కింద వివిధ కారణాలతో స్థానికత కోల్పోయిన టీచర్ల బదిలీలకు సంబంధించి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు గడువు ఆదివారంతో ముగియగా, రాష్ట్రవ్యాప్తంగా 6,500 మంది అప్లై చేసుకున్నారు. వీటిని తొలిదశలో డీఈవోలు పరిశీలించి, ఆన్లైన్లోనే ప్రభుత్వానికి పంపించనున్నారు. ఇప్పటికే జీవో 317 మినహాయింపులు పొందిన వారికి మరోసారి అవకాశం ఇవ్వబోరు. ఈ క్రమంలో అందిన దరఖాస్తులన్నింటినీ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఉద్యోగుల స్థానికత, కేటాయింపు ప్రక్రియలో జరిగిన పొరపాట్లు, ఇతర నిర్దిష్ట కారణాల ఆధారంగా ఈ దరఖాస్తులను స్క్రూటినీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హత కల్గిన అప్లికేషన్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. మూడు, నాలుగు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే, నిబంధనల ప్రకారం ప్రస్తుతం వచ్చిన అప్లికేషన్లలో సగం మాత్రమే అర్హత సాధించే అవకాశం ఉందని తెలుస్తున్నది.
