
- క్లీన్ అండ్ గ్రీన్ దిశగా ప్రజారవాణా వ్యవస్థ
- మౌలిక సదుపాయాల కల్పనకు సిటీ బస్సుల్లో అదనపు చార్జీలు
- ప్రజలు సహకరించాలని ఆర్టీసీ విజ్ఞప్తి
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్లో కాలుష్యరహిత ప్రజా రవాణా వ్యవస్థ కోసం 2027 నాటికి ఓఆర్ఆర్ పరిధిలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, క్లీన్ అండ్ గ్రీన్ రవాణా వ్యవస్థను నడిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బస్సుల వినియోగంతో వ్యక్తిగత వాహన కొనుగోళ్లు తగ్గి, ప్రజా రవాణా వాడకం పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తున్నది.
ఫలితంగా వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు తగ్గడంతోపాటు నగరవాసుల్లో శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు తగ్గి.. ఆయుర్దాయం మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. రాబోయే రెండేండ్లలో దశలవారీగా ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ ప్రణాళిక రెడీ చేసింది.
మౌలిక సదుపాయాలకు రూ.392 కోట్లు
గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 25 డిపోలు ఉన్నాయి. వీటిలో 6 డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఈ ఏడాది మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్కో డిపోలో రూ.8 కోట్ల వ్యయంతో పూర్తి చార్జింగ్ కోసం హెచ్టీ కనెక్షన్లను టీజీఎస్పీడీసీఎల్, ట్రాన్కో ద్వారా నిర్మించింది.
రాబోయే 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం 19 డిపోల్లో చార్జింగ్ హెచ్టీ కనెక్షన్లను సంస్థ ఏర్పాటు చేయనుంది. అలాగే ప్రజా రవాణా విస్తరణకు కొత్తగా 10 డిపోలు, 10 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుంది. ఈ మౌలిక సదుపాయాలకు రానున్న సంవత్సరంలో రూ.392 కోట్ల వ్యయమవుతుందని టీజీఎస్ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.