
ముంబై: అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. రుతుపవనాల ప్రభావంతో శక్తి తుఫాను తీవ్రతరం అయింది. గుజరాత్ తీరంలో అరేబియా సముద్రం భయంకరంగా మారింది. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. శక్తి తుఫాను తీవ్ర తుఫానుగా మారిందని, గాలులు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో విపరీతంగా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను ప్రస్తుతం తీరం నుంచి 420 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.
గుజరాత్, ద్వారక దగ్గర పశ్చిమ నైరుతి దిశగా తుఫాను అరేబియా సముద్రంలోకి కదులుతోంది. ఆదివారం వరకు గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర తీరం, పాకిస్తాన్ తీరం వెంబడి సముద్రంలో అల్లకల్లోలంగా ఉంటుందని.. తీరం వెంబడి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటీవలే భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లిన ముంబై మహా నగరానికి ఐఎండీ మరోసారి భారీ వర్ష సూచన చేసింది.
‘శక్తి’ తుఫాను ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. థానే, పాల్ఘర్, రాయ్‌గడ్, రత్నగిరి, సింధుదుర్గ్‌లలో అక్టోబర్ 4 నుంచి 7 వరకు భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్టోబర్ 4 నుంచి 5 వరకు ఉత్తర మహారాష్ట్ర తీరం వెంబడి విపరీతమైన వేగంతో గాలులు వీస్తాయని, గంటకు 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
వచ్చే మంగళవారం వరకు వాయువ్య, ఈశాన్య, మధ్య అరేబియా సముద్రం, గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర తీరాల వెంబడి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచించింది. గుజరాత్, మహారాష్ట్రపై ఈ ‘శక్తి’ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.