చదువు మానేసి యూట్యూబ్‌‌లోకి.. నెలకు రూ.35 లక్షల సంపాదిస్తున్న యువకుడి సక్సెస్ స్టోరీ !

చదువు మానేసి యూట్యూబ్‌‌లోకి.. నెలకు రూ.35 లక్షల సంపాదిస్తున్న యువకుడి సక్సెస్ స్టోరీ !

అనుకున్న కాలేజీలో సీటు రాలేదు. నచ్చకపోయినా బిట్స్‌‌పిలానీలో బీఈలో చేరాడు. అక్కడ అతని ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. చదువుకు ఫుల్‌‌స్టాప్‌‌ పెట్టి ఎంట్రప్రెన్యూర్‌‌‌‌, కంటెంట్ క్రియేటర్‌‌‌‌గా మారాడు ఇషాన్ శర్మ. దాంతో ఎంతోమంది అతన్ని ట్రోల్ చేశారు. అతని ప్రయాణంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. అయినా ఎదురైన సవాళ్లను ఒక్కో మెట్టుగా మార్చుకుని సక్సెస్‌కు కొత్త దారులు వేసుకున్నాడు. అటు బిజినెస్‌‌లో, ఇటు సోషల్‌‌మీడియాలో రాణించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. 

ఇషాన్ శర్మ మధ్యప్రదేశ్‌‌లోని ఖాండ్వాలో 2000 అక్టోబర్ 2న పుట్టాడు. చిన్నప్పటినుంచి చదువులో ముందుండేవాడు. ఇంజనీర్ కావాలని కలలు కన్నాడు. 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్‌‌లో ఫస్ట్‌‌ క్లాస్‌‌లో పాసయ్యాడు. ఐఐటీలో ఇంజినీరింగ్‌ చేయాలి అనుకున్నాడు. కానీ.. సీటు సాధించలేకపోయాడు. దాంతో బిట్స్ పిలానీ గోవా క్యాంపస్‌‌లో చేరాడు. కాలేజీలో ఉన్నప్పుడు ఇషాన్‌‌కు కోడింగ్, కంటెంట్ క్రియేషన్‌‌పై ఆసక్తి పెరిగింది. ఆన్‌‌లైన్‌‌లో క్లాస్‌‌లు విని పైథాన్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్‌‌ లాంటి స్కిల్స్ నేర్చుకున్నాడు. దాంతో చదువుని పట్టించుకోలేదు. 2020లో కరోనా మహమ్మారి వచ్చి ఇషాన్ జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆ టైంలో ఆన్‌‌లైన్ క్లాస్‌‌లు వింటూ ఇంట్లోనే ఉండడంతో అతని దృష్టి పూర్తిగా సోషల్‌‌ మీడియా కంటెంట్‌‌ మీద పడింది. ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు.

చుట్టుపక్కల వాళ్లు, ఫ్రెండ్స్‌‌ ట్రోల్‌‌ చేసినా పట్టించుకోలేదు. అందరూ అతనికి ‘‘యూట్యూబ్‌‌లో టైం వేస్ట్‌‌ చేసుకుంటున్నావు. బాగా చదువుకో” అని సలహా ఇచ్చేవాళ్లు. అయినా వెనక్కి తగ్గకుండా ఇషాన్‌‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉండేవాడు. 

డ్రాపవుట్.. 

ఇషాన్‌‌ క్యాంపస్‌‌లో చేరిన మొదటి సంవత్సరం 2019 జనవరిలో ‘ఇషాన్ శర్మ’ పేరుతో యూట్యూబ్ చానెల్‌‌ పెట్టాడు. అప్పుడు ఒకే వీడియో అప్‌‌లోడ్‌‌ చేసి మానేశాడు. మళ్లీ 2020లో టెక్ ట్యుటోరియల్స్ (పైథాన్, జావాస్క్రిప్ట్), పర్సనాలిటీ డెవలప్‌‌మెంట్​పై వీడియోలు చేశాడు.  కేవలం ఆరు నెలల్లోనే చానెల్ మానిటైజ్ అయింది. మొదటి డాలర్ సంపాదించిపెట్టింది. ఆ తర్వాత చానెల్‌‌కి సబ్‌‌స్క్రయిబర్స్ సంఖ్య, వ్యూస్ బాగా పెరిగాయి. దాంతో ఫుల్‌‌ టైం యూట్యూబర్‌‌‌‌గా మారాలనే ఉద్దేశంతో 2022లో బీఈ థర్డ్‌‌ ఇయర్‌‌‌‌లో ఉన్నప్పుడు చదువు మానేశాడు. 

స్టార్టప్‌‌ 

గోవా నుంచి స్టార్టప్ హబ్‌‌గా పేరుగాంచిన బెంగళూరుకు వెళ్లాడు. తర్వాత కాలేజీలో చదువుతున్నప్పుడు తన రూమ్‌‌మేట్ సరాన్ష్ ఆనంద్‌‌తో కలిసి మార్కెటింగ్ ఏజెన్సీ ‘మార్కిట్‌‌అప్’ని స్థాపించాడు. ఒకవైపు సోషల్ మీడియాలో రాణిస్తూనే క్రియేటివ్‌‌ వైరల్ కంటెంట్ మార్కెటింగ్ వ్యూహాలతో బిజినెస్‌‌ని కూడా డెవలప్ చేశాడు. ఎన్నో పేరుగాంచిన కంపెనీలకు సర్వీసులు అందించాడు. బ్రాండ్‌‌లకు ఆర్గానిక్‌‌గా గ్రోత్‌‌ వచ్చేలా చేశాడు. ప్రస్తుతం ఈ కంపెనీ ఇండియాతోపాటు అమెరికా, యూకేల్లో 40కిపైగా  క్లయింట్లకు సేవలు అందిస్తోంది. 

యూట్యూబ్‌‌లో..

ఇషాన్‌‌ శర్మ చానెల్‌‌లో ఇప్పటివరకు 1736 వీడియోలను అప్‌‌లోడ్‌‌ చేశాడు. 2024 నాటికి చానెల్‌‌ మిలియన్ సబ్‌‌స్క్రయిబర్ల మార్క్‌‌ని దాటింది. ప్రస్తుతం 1.99 మిలియన్ల సబ్‌‌స్క్రయిబర్లు ఉన్నారు. వీడియోలు మిలియన్ల వ్యూస్ సాధిస్తున్నాయి. చానెల్‌‌లో అనుభవ్ దూబే, నితిన్ కామత్, శ్లోక్ శ్రీవాస్తవ, క్రిస్ దో, అమన్ దత్తర్వాల్,  నోహ్ కాగన్ లాంటి ప్రముఖులతో పాడ్‌‌కాస్ట్‌‌లు చేశాడు. 

రెండు పుస్తకాలు

కృషితో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన ఇషాన్ రెండు బెస్ట్ సెల్లింగ్ పుస్తకాలను కూడా రాశాడు. 2020లో తన తొలి పుస్తకం ‘క్రష్ ఇట్‌‌ ఆన్ లింక్డ్‌‌ఇన్‌‌’ను ప్రచురించాడు. అది 5,000 కాపీలకు పైగా అమ్ముడైంది. తన ఫ్రెండ్‌‌ సీఏ కుశాల్ లోధాతో కలిసి రెండో పుస్తకం ‘అన్‌లాకింగ్ యూనీకార్న్ సీక్రెట్స్​’ను రాశాడు. 2024లో పెంగ్విన్ ఇండియా పబ్లిష్ చేసిన ఈ పుస్తకంలో ఇండియాకు చెందిన ఇరవై మంది యూనీకార్న్ ఎంట్రప్రెన్యూర్ల గురించి వివరించాడు. ఇది లాంచ్ అయిన 3 గంటల్లోనే అమెజాన్‌‌లో బెస్ట్‌‌సెల్లర్‌‌‌‌గా నిలిచింది. అంతేకాదు.. ఇషాన్ ఇండియా అంతటా ఎన్నో కాలేజీల్లో ప్రసంగాలు ఇచ్చాడు. వేలాది మంది విద్యార్థులను ఇన్‌‌స్పైర్ చేశాడు. అన్‌‌అకాడమీలో కోడింగ్ ట్యూటర్‌‌‌‌గా పైథాన్, జావా స్క్రిప్ట్‌‌లపై క్లాస్‌‌లు చెప్పాడు. అతను చెప్పిన 350 గంటలకు పైగా క్లాస్‌‌లు అందుబాటులో ఉన్నాయి. 

నెలకు 35 లక్షలు

ఇషాన్ కెరీర్ ఆరంభంలోనే ఇంటెల్ ఎడ్జ్ ఏఐ స్కాలర్‌‌షిప్, ఉడాసిటీ బెర్టెల్స్‌‌మాన్ ఏఐ స్కాలర్‌‌షిప్‌‌లను అందుకున్నాడు. 2023 అక్టోబర్​లో ఇన్‌‌స్టాగ్రామ్​లో చేసిన పోస్ట్‌‌లో అతని ఆదాయం కేవలం మూడేండ్లలోనే నెలకు రూ. 5 వేల నుంచి రూ. 20 లక్షలకు పెరిగిందని చెప్పాడు. 2024లో ఒక పాడ్‌‌కాస్ట్‌‌లో మాట్లాడుతూ.. ఇషాన్‌‌ నెలకు రూ. 35 లక్షలు సంపాదిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పుడు అతని ఆదాయం మరింత పెరిగింది. ప్రస్తుతం తన కంపెనీ ద్వారానే కాకుండా యూట్యూబ్‌‌ యాడ్స్‌‌, స్పాన్సర్‌‌షిప్‌‌లు, అఫిలియేషన్స్‌ ద్వారా సంపాదిస్తున్నాడు. ఈ మధ్యే బెంగళూరులో కొత్త ఇల్లు కొన్నాడు. ఆఫీస్‌‌ని  అప్‌‌గ్రేడ్ చేశాడు. ఒక నివేదిక ప్రకారం అతని ఆస్తుల విలువ రూ. 6 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా.

రోబోట్యాక్సీ ఎక్స్‌‌పీరియెన్స్‌‌

ఇషాన్ ఈ మధ్య యుఎస్‌‌లో కాలిఫోర్నియాలోని బే ఏరియాలో టెస్లా రోబోటాక్సీ రైడ్‌‌ని ఎక్స్‌‌పీరియెన్స్‌‌ చేశాడు. దాదాపు 4.5 అమెరికన్ డాలర్లు చెల్లించి ఐదు నిమిషాల రైడ్ చేశాడు. ఆ వీడియో సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌ చేయడంతో బాగా వైరల్ అయ్యింది.