
జగిత్యాల జిల్లాలో కాకా వెంకటస్వామి 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాకా చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లక్ష్మణ్.. తాను మంత్రి స్థాయికి ఎదిగానంటే అది కాకా దయవల్లేనని తెలిపారు.
దళితులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాల్పడిన మహనీయుడు కాక వెంకటస్వామి అని కొనియాడారు మంత్రి లక్ష్మణ్. మా తండ్రి కాకా శిష్యుడిగా పనిచేశారు. కాకా కుటుంబానికి మాకు మంచి సన్నిహిత్యం ఉంది.. కాకాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
నష్టాల్లో ఉన్న బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి రూ.500 కోట్ల రుణమాఫీ చేసి సింగరేణి సంస్థలు కాపాడారని గుర్తు చేశారు. సింగరేణిలో లక్ష మంది ఉద్యోగులను కాపాడిన ఘనత కాక వెంకటస్వామిది అని అన్నారు. హైదరాబాద్ లో 70 వేల మంది నిరుపేదలకు గుడిసెలు వేయించి పట్టాలు ఇప్పించారని చెప్పారు.
అంబేద్కర్ కాలేజీ ఏర్పాటుచేసి విద్యార్థులకు విద్యానందిస్తున్న ఏకైక కుటుంబం కాకా కుటుంబం అని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే తన ప్రాణాలు పోతాయని గర్వంగా గళం విప్పిన లీడర్ కాక అని అన్నారు మంత్రి లక్ష్మణ్.