ఆర్యన్‌ ఖాన్ బయటకొస్తే ఆధారాలు దొరక్కుండా చేసే ఛాన్స్ ఉంది

ఆర్యన్‌ ఖాన్ బయటకొస్తే ఆధారాలు దొరక్కుండా చేసే ఛాన్స్ ఉంది
  • ముంబై స్పెషల్ కోర్టులో అడిషనల్ సొలిసిటర్ జనరల్ 

ముంబయి: క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్‌ ఖాన్ బయటకొస్తే ఆధారాలు దొరక్కుండా చేసే ఛాన్స్ ఉందని ముంబై స్పెషల్ కోర్టులో అడిషనల్ సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్  పై  గురువారం ముంబయి స్పెషల్ కోర్టులో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు సుదీర్ఘంగా సాగాయి. ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ దొరికాయా ? లేదా ? అన్నది ముఖ్యం కాదు అంటూనే గతంలో ఇలాంటి కేసుల్లో పలు కోర్టులు ఇచ్చిన తీర్పులను కోర్టు ముందు ఉంచారు అడిషనల్ సొలిసిటర్ జనరల్. ఈ కేసులో అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాకు సంబంధించిన లావాదేవీలున్నాయని, వారితో ఆర్యన్ ఖాన్ ఫోన్ సంభాషణలు ఉన్నాయన్నారు. కాబట్టి బెయిల్ పై బయటకు వస్తే ఆధారాలను ధ్వంసం చేస్తారంటూ వాదనలు వినిపించారు అడిషనల్ సొలిసిటర్ జనరల్. ఆర్యన్ ఖాన్ తరపు లాయర్ కౌంటర్ ఇస్తూ.. ఇన్నిరోజుల విచారణలో ఒక్కసారి మాత్రమే ఆర్యన్ ఖాన్ స్టేట్మెంట్ తీసుకున్నారని అభ్యంతరం తెలిపారు. విచారణలో వాట్స్ అప్ ఛాటింగ్, ఫోన్ కాల్ సంభాషణలు అంటూ ఎన్సీబీ చెబుతోంది.. అసలు ఫోన్ వాళ్ల దగ్గరే ఉంది కదా.. ? ఫోన్ ఎన్సీబీ అధికారుల దగ్గరే ఉంచుకొని ఆర్యన్ ఖాన్ కి బెయిల్ ఇవ్వడానికి వారికీ అభ్యంతరం ఏంటి ? అంటూ ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో ముంబయి స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఈనెల 20న తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు ప్రకటించింది.