ప్రాణం ఉన్నంత వరకు పోరాడతా.. లొంగేది లేదు: ఈటల 

ప్రాణం ఉన్నంత వరకు పోరాడతా.. లొంగేది లేదు: ఈటల 

కరీంనగర్: ‘‘నన్ను ఓడించాలన్న కుట్రతోనే హుజురాబాద్ లో దళితబంధు సహా అనేక పథకాలు తెచ్చాడు.. ఓటుకు 20 వేలిచ్చినా, లక్ష ఇచ్చినా తీసుకోండి.. అక్రమంగా సంపాదించిన సొమ్ము అది.. మళ్లీ మీకు వాళ్లు దొరకరు..’’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వంతడ్పుల గ్రామంలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రజల మీద వాళ్లకు నమ్మకం లేదని, కేవలం డబ్బు, మద్యం, కుట్రల మీద మాత్రమే వాళ్లకు నమ్మకముందన్నారు. నేనేమైనా తప్పు చేసానా? ఇన్నేళ్లలో మీ దగ్గర ఐదు పైసలైనా తీసుకున్నానా.. ? అని ఈటల ప్రశ్నించారు.

1500 కోట్లు ప్రజల వాటా కట్టినా ఇప్పటికీ ‘అభయహస్తం’ ఇవ్వడం లేదు
‘‘కేంద్ర పథకాలు అమలు చేయకుండా కేసీఆర్ తన ముద్ర మాత్రమే ఉండాలనుకుంటున్నాడు.. 1500 కోట్లు ప్రజల వాటా కట్టినా ఇప్పటికీ అభయ హస్తం ఇవ్వడం లేదు.. మనల్ని గొర్రెల్లాగా చూస్తున్నాడు.. ’’ అని ఈటల రాజేందర్ అన్నారు. ‘‘చదువుతోనే అన్నిసమస్యలు తీరుతాయని.. కష్టాల కోర్చి చదువుకుంటే.. ఉద్యోగాలు రావడం లేదు. చదువుకున్న వాళ్లకు పనులులేక వివాహాలు కావడం లేదు.. తల్లిదండ్రులు వయోభారంతో కష్టపడుతూ ఇప్పటికీ పిల్లలను పోషిస్తున్నారు.. కనీసం వాళ్లకు ఇస్తామన్న 3016 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు.. రైతురుణ మాఫీ లేదు.. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు.. ’’ అని ఈటల రాజేందర్ అన్నారు. 


ప్రాణం ఉన్నంత వరకు పోరాడతా.. లొంగిపోయేది లేదు
నా బొందిలో ప్రాణమున్నంత వరకు పోరాడుతాను తప్ప లొంగిపోయేది లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి స్పష్టం చేశారు. ‘‘5 నెలల 20 రోజులుగా కేసీఆర్ అహంకారంతో, డబ్బు సంచుల మధ్య పోరాడుతున్నా.. సంపాదించిన ఆస్తులమ్మి అయినా ఖర్చు చేసి పోరాడమని నా భార్య చెప్పింది.. నాతో ఎవరు తిరిగినా వాళ్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు.. ఊర్లకు ఊర్లకు  బార్లుగా మారుతున్నాయి.. 30 తర్వాత మీ భరతం పడుతా.. ఎవరైనా ఈటల రాజేందర్ కు ఓటేస్తామని చెబితే... రాజేందర్ గుర్తు కారు గుర్తు అని తప్పుదోవ పట్టిస్తున్నారు.జ నా గుర్తు పువ్వు గుర్తు.. మరిచిపోకండి.. మీ ఓట్ల ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవి కూడా తానే ఇచ్చాననుకుంటున్నాడు.. గడ్డి బడ్డి కింద పోయే కుక్క.. ఆ బండిని తానే మోస్తున్నానని భావించినట్లుగా.. కేసీఆర్ కూడా అనుకుంటున్నాడు.. మనం కేసీఆర్ ను మోస్తుంటే.. మనల్నే ఆయన మోస్తున్నానని అనుకుంటున్నాడు.. మీరంతా 30వ తేదీన నన్ను గుర్తుంచుకుని ఆశీర్వదించండి..’’ అని ఈటల రాజేందర్ అన్నారు.