జనగామ డీఎం ఆఫీసులో అక్రమ వసూళ్లు

 జనగామ డీఎం ఆఫీసులో అక్రమ వసూళ్లు
  • వడ్ల కొనుగోలు రికన్సిలేషన్ డబ్బులు తీసుకుంటున్న వైనం
  • రూ. వేలల్లో వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్న ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు   

జనగామ, వెలుగు: ఐకేపీ సెంటర్ల నిర్వాహకుల వడ్ల కొనుగోలు రికన్సిలేషన్ చేసేందుకు జనగామ సివిల్​సప్లై ఆఫీస్​సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలో యాసంగి సీజన్​లో సుమారు 160  ఐకేపీ సెంటర్ల ద్వారా వడ్లను కొనుగోలు చేయగా.. వాటి నిర్వాహకుల వివరాల రికన్సిలేషన్​ను మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. రికన్సిలేషన్​ పూర్తైతేనే క్వింటాలుకు రూ. 32  కమీషన్ ​డబ్బులు ఐకేపీ సెంటర్ల నిర్వాహకులకు అందుతాయి. దీంతో సివిల్​సప్లై ఆఫీస్​ సిబ్బంది బలవంతపు వసూళ్లకు తెరలేపారు. 

ఆపరేటర్​కు రూ. 1000, అటెండర్ కు రూ .100 నుంచి రూ. 200 ఇవ్వనిదే రికన్సిలేషన్​చేయడం లేదు.  ప్రతి సెంటర్ నుంచి రూ. వెయ్యికి పైగానే డబ్బులు తీసుకుంటున్నట్టు ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇలా బలవంతపు వసూళ్లు చేయలేదని పేర్కొంటున్నారు. కొందరు డబ్బులను ఫోన్​ పే ద్వారా చెల్లించగా, ఇంకొందరు నగదుగా ఇచ్చినట్లు చెప్పారు. 

సిబ్బంది అవినీతిని అరికట్టాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.  దీనిపై జనగామ సివిల్ సప్లై డీఎం వి. హథీరామ్​ను వివరణ కోరగా.. రికన్సిలేషన్​కు ఒక్కో సెంటర్​నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.