- షార్ట్ ఫార్మాట్లో రాణించడంపైనే టీమిండియా దృష్టి
- రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్
రాయ్‌పూర్: కొత్త కెప్టెన్ స్మృతి మంధాన నాయకత్వంలో ఇండియా విమెన్స్ జట్టు.. జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఆసియా స్థాయిలో తమ ఆధిపత్యాన్ని ఇటీవల మరోసారి నిరూపించుకున్నప్పటికీ, ఇంటర్నేషనల్ స్థాయి టీ20 ఫార్మాట్లో ఇండియా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది.
టీ20 వరల్డ్ కప్‌లలో ఆశించిన ఫలితాలు రాకపోవడం జట్టులోని బలహీనతలను బయటపెట్టింది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లతో నిలకడగా పోటీ పడాలంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన టీమిండియాకు రాబోయే ఏడాది ప్రారంభంలో ఇండియాలో జరగనున్న తొలి విమెన్స్ చాంపియన్స్ ట్రోఫీ గెలవడం సవాల్‌తో కూడుకున్నది. కాబట్టి ఇప్పట్నించే అన్ని విభాగాలను పటిష్టం చేసుకోవాలని హోమ్ టీమ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
స్మృతి, షెఫాలీ కీలకం...
టీమిండియా బ్యాటింగ్‌లో స్మృతి, షెఫాలీ వర్మ మంచి ఆరంభాన్నిస్తున్నా.. మిడిలార్డర్ ఆ వేగాన్ని కొనసాగించలేకపోతున్నది. మూడో ప్లేస్‌లో ఎవర్ని ఆడించాలన్న దానిపై స్పష్టత లేదు. మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం బ్యాటర్‌గానే కొనసాగుతున్న హర్మన్‌పై ఈ సిరీస్‌లో కచ్చితంగా రాణించాల్సిన ఒత్తిడి పెరిగింది. లోయర్ ఆర్డర్లో రిచా ఘోష్‌కు తోడుగా మరికొంత మంది పవర్ హిట్టర్లను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
బౌలింగ్‌లో ఇండియా ఎక్కువగా స్పిన్ బౌలింగ్‌పై ఆధారపడుతుంది. యువ స్పిన్నర్ శ్రీచరణి అద్భుతంగా రాణిస్తుండటం, అనుభవజ్ఞురాలైన ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఆఫ్ స్పిన్‌తో బ్యాటర్లను ఇబ్బందిపెడుతోంది. మిడిల్ ఓవర్లలో క్రమం తప్పకుండా వికెట్లు సాధించేందుకు లెగ్ స్పిన్నర్ ప్రేమ రావత్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. నికీ ప్రసాద్, మిన్నుమణి కలితాపై ఆశలు ఉన్నాయి. పేస్ బౌలింగ్‌లో నందాని శర్మ, క్రాంతి గౌడ్ రాణించడం సానుకూలాంశం. అయినప్పటికీ పేస్ దళాన్ని మరింత పటిష్టంగా మార్చాల్సి ఉంది. ఇక ఫీల్డింగ్‌లోనూ ఇండియా చాలా మెరుగుపడాల్సి ఉంది.
గెలుపే లక్ష్యంగా..
మరోవైపు జింబాబ్వే జట్టు తొలిసారి ఇండియాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతుండటంతో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. సెప్టెంబర్, అక్టోబర్‌లో విండీస్‌తో ఆడిన జట్టునే కొనసాగించారు. కెలిస్ నధ్లోవ్, బిలవ్డ్ బిజా, చిపో ముగేరితిరిపానో కూడిన ఫైనల్ ఎలెవన్‌తో ఆడనున్నారు. మిచెల్ మువుంగా, క్రిస్టిన్ ముటాసా, టెండై మకుసా, నొమ్వెల్ సిబాండా, కుడ్జాయ్ చిగోరాలతో కూడిన పేస్ బలగం బాగుంది. ఆల్‌రౌండర్ న్యాషా గ్వాన్జురా, లోరిన్ ఫిరితో పాటు బిజా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగల సత్తా ఉంది.
తుది జట్లు (అంచనా)
ఇండియా: స్మృతి మంధాన (కెప్టెన్), షెఫాలీ వర్మ, అనుష్క శర్మ / నికీ ప్రసాద్, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, భారతి పుల్మాలి, దీప్తి శర్మ, ప్రేమ రావత్, శ్రీచరణి, నందాని శర్మ, క్రాంతి గౌడ్.
జింబాబ్వే: జొసెఫిన్ ఎంకోమో (కెప్టెన్), కెలిస్ నధ్లోవ్, బిలవ్డ్ బిజా, చిపో ముగెరి తిరిపానో, క్రిస్టిన్ ముటాసా, న్యాషా గ్వాన్జురా, చిదెజా దురురు, మోడెస్టర్ ముపాచిక్వా, కుడ్జాయ్ చిగోరా, లోరిన్ ఫిరి, సిబండా.
