
- 113 వెహికల్స్ కొనుగోలుకు ఒప్పందం
- రూ.130 కోట్లతో జేబీఎం ఆటో లిమిటెడ్‌తో డీల్
న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీ 113 ఎలక్ట్రిక్ బస్సులు, 43 ఫాస్ట్ చార్జర్లు కొనేందుకు జేబీఎం ఆటో లిమిటెడ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా తొలిసారి ఇండియన్ ఆర్మీ ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగించనున్నది. ఈ మేరకు రూ.130 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నది. సస్టనైబుల్, ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఈ ఎలక్ట్రిక్ బస్సులు కీలక పాత్ర పోషిస్తాయని ఇండియన్ ఆర్మీ అధికారులు ప్రకటించారు.
పెట్రోల్, డీజిల్ వెహికల్స్ వాడకాన్ని తగ్గిస్తూ.. పర్యావరణహితం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆర్మీ తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ తో పాటు నేవీ అధికారులు ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగిస్తారు. ఆర్మీకి 60, ఎయిర్‌ఫోర్స్‌కు 46, నేవీకు 7 బస్సులను కేటాయించారు. ప్రతి బస్సులో 40 సీట్లు ఉంటాయి. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 250 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది.
గంటకు 65 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది. 2024, జులైలోనే ట్రయల్స్ మొదలయ్యాయి. తాజాగా ఫైనల్ కాంట్రాక్ట్ పై ఇండియన్ ఆర్మీ, జేబీఎం సంతకం చేశాయి.