ఐపీఎల్ ఫైనల్లో చెలరేగిన చెన్నై.. కోల్‌కతా టార్గెట్ 193

 ఐపీఎల్ ఫైనల్లో చెలరేగిన చెన్నై.. కోల్‌కతా టార్గెట్ 193

దుబాయ్: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బ్యాట్ ఝుళిపించడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి కేవలం 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేశారు. ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ముందు 193 ప‌రుగుల‌ భారీ ల‌క్ష్యాన్ని ఉంచారు.
ఫైన‌ల్ మ్యాచ్‌లో భాగంగా టాస్ ఓడి చెన్నైను  బ్యాటింగ్ కు ఆహ్వానించిన కోల్ కతా జట్టుకు ధోనీసేన‌ శుభారంభం మింగుడుపడనీయలేదు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడడంతో స్కోర్ బోర్డు చకచకా పరుగులు తీసింది. ఓపెనర్  డుప్లెసిస్ (86) హాఫ్ సెంచ‌రీతో మెరవగా.. రుతురాజ్ గైక్వాడ్ (32) పరుగులు చేసి తొలి వికెట్ కు 61 పరుగులు జోడించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన రాబిన్ ఉత‌ప్ప (31) కూడా ధాటిగా ఆడడంతో రన్ రేట్ ఏమాత్రం తగ్గలేదు. ఓపెనర్ డుప్లెసిస్  కు  మెయిన్ అలీ జత కలిశాడు. రెండు ఫోర్లు 3 సిక్సర్లతో మెయిన్ అలీ (37) ధాటిగా ఆడడంతో స్కోరు పరుగులు తీసింది. ఇన్నింగ్ చివరి బంతికి ఓపెనర్ డుప్లెసిస్ భారీ షాట్ కు ప్రయత్నించి (86) ఔట్ కావడంతో చెన్నై 3 వికెట్ల నష్టానికి  192  పరుగుల వద్ద ముగిసింది. చెన్నై బ్యాటర్ల ధాటికి కోల్‌క‌తా బౌల‌ర్ల‌ు ఎవరూ పెద్దగా ఒత్తిడి చేయలే పోవడంతో న‌రైన్ 2 వికెట్లు దక్కగా మావికి మరో వికెట్ దక్కింది. కాగా టార్గెట్ ఛేదనకు బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా తొలి ఓవర్లో ఆరు పరుగులు చేసింది. శుభమన్ గిల్ (5), వెంకటేశ్ అయ్యర్ (0) క్రీజులో ఉన్నారు. 
చెన్నై అరుదైన రికార్డు
ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై జట్టు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. చెన్నై ఓపెనర్లు డుప్లెసిస్, రుతురాజ్‌ గైక్వాడ్‌  తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం  ఇది ఏడోసారి కాగా ఇందులో మూడుసార్లు కేకేఆర్‌పైనే నమోదు చేశారు. ఓపెనర్లు అర్థసెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన ప్రతి మ్యాచులోనూ చెన్నై విజయం సాధించింది. ఓవరాల్ గా ఐపీఎల్ లో రుతురాజ్‌- డుప్లెసిస్‌ జోడి ఈ సీజన్‌లో 756 పరుగులు జోడించి మూడో స్థానానికి చేరుకున్నారు. డివిలియర్స్- కోహ్లి (ఆర్‌సీబీ) జోడి 2016 ఐపీఎల్‌ సీజన్‌లో 939 పరుగులతో తొలి స్థానంలో ఉండా.. హైదరాబాద్ సన్ రైజర్స్ జోడీ  డేవిడ్‌ వార్నర్‌- బెయిర్‌ స్టో 2019 ఐపీఎల్‌ సీజన్‌లో 791 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు.