రైజర్స్‌, రైడర్స్‌ రాత మారేనా!

రైజర్స్‌, రైడర్స్‌ రాత మారేనా!
  • మరో మూడో రోజుల్లో ఐపీఎల్‌‌ ఫేజ్‌‌2

(వెలుగు, స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌) ఇండియా వేదికగా ప్రారంభమైన ఐపీఎల్‌‌ 2021 ఎడిషన్‌‌ కరోనా వైరస్‌‌ దెబ్బకు మధ్యలోనే నిలిచిపోయింది. ఆ సమయానికి టాప్‌‌ లెవెల్‌‌ పెర్ఫామెన్స్‌‌లు ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌, చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌, రాయల్ చాలెంజర్స్‌‌ బెంగళూరు జట్లు టేబుల్లో వరుసగా టాప్‌‌–3లో నిలిచాయి.  ఫస్ట్‌‌ ఫేజ్‌‌లో ఢిల్లీ మినహా.. ఇతర జట్ల ప్రయాణం పడుతూ లేస్తూ సాగింది. అయితే,  కరోనా పుణ్యమాని అనుకోకుండా వచ్చిన బ్రేక్‌‌ వల్ల తమ తప్పులు సరి చేసుకునేందుకు అన్ని జట్లకు ఓ గోల్డెన్‌‌ చాన్స్‌‌ దొరికింది. ప్రస్తుతం టేబుల్లో అట్టడుగున ఉన్న  జట్లు కూడా ప్లే ఆఫ్స్‌‌కు చేరేందుకు ఇంకా దారి కనిపిస్తోంది. ఈ నెల19వ తేదీ నుంచి సెకండ్‌‌ ఫేజ్‌‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తొలి దశలో చెత్తాటతో చివరి రెండు స్థానాల్లో నిలిచిన సన్‌‌రైజర్స్‌‌హైదరాబాద్‌‌, కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..


ఒత్తిడిలో నైట్‌‌రైడర్స్‌‌..
ఇయాన్‌‌ మోర్గాన్‌‌ కెప్టెన్సీలోని కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌.. యూఏఈ లెగ్‌‌లో తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగనుంది. ఫస్ట్‌‌ ఫేజ్‌‌లో ఏడు మ్యాచ్‌‌లాడి రెండు గెలిచిన నైట్‌‌రైడర్స్‌‌  ప్రస్తుతం టేబుల్లో  ఏడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్‌‌ రేసులో నిలవాలంటే  ప్రతీ మ్యాచ్‌‌లోనూ గెలిచి తీరడం వారికి అత్యవసరం. టాప్‌‌ టీ20 ప్లేయర్లు అందుబాటులో ఉన్నా.. తుది జట్టు ఎంపికలో తప్పు చేయడం ఫస్ట్‌‌ ఫేజ్‌‌లో కోల్‌‌కతాను బాగా దెబ్బతీసింది. షకీబల్‌‌ హసన్‌‌, సునీల్‌‌ నరైన్‌‌, లూకీ ఫెర్గుసన్‌‌, టిమ్‌‌ సీఫర్ట్‌‌ వంటి ఫారినర్లు అందుబాటులో ఉన్నా మోర్గాన్‌‌ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఇక, యంగ్‌‌స్టర్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, నితీశ్‌‌ రాణా, రాహుల్‌‌ త్రిపాఠితో కూడిన టాపార్డర్‌‌ తొలి ఫేజ్‌‌లో మంచి స్టార్ట్‌‌లు ఇవ్వలేకపోయింది. టాపార్డర్‌‌ అనుభవలేమి వల్ల బ్యాటింగ్‌‌ అంశంలో సెకండ్‌‌ ఫేజ్‌‌లోనూ  కెప్టెన్‌‌ మోర్గాన్‌‌పై  ఒత్తిడి ఉండనుంది. ఆండ్రీ రసెల్‌‌ మినహా సరైన ఫినిషర్‌‌  జట్టులో లేకపోగా స్టార్​ పేసర్​ పాట్‌‌ కమిన్స్‌‌ సేవలు కోల్పోవడం ఈ సారి పెద్ద మైనస్‌‌. కమిన్స్‌‌కు రీప్లేస్‌‌మెంట్‌‌గా టిమ్‌‌ సౌథీ(న్యూజిలాండ్‌‌)ని తీసుకున్నారు.  మిస్టరీ స్పిన్నర్‌‌ వరుణ్‌‌ చక్రవర్తి, యంగ్​ పేసర్‌‌ ప్రసిధ్‌‌ కృష్ణపై కాస్త అంచనాలున్నాయి. అబుదాబి వేదికగా  బెంగళూరుతో వచ్చే సోమవారం జరిగే పోరుతో కోల్‌‌కతా తమ సెకండ్‌‌ ఫేజ్‌‌ను స్టార్ట్‌‌ చేయనుంది.

ఫస్ట్‌‌ ఫేజ్‌‌లో నైట్‌‌రైడర్స్‌‌..
ఆడిన మ్యాచ్‌‌లు    7
గెలిచినవి    2
ఓడినవి    5
పాయింట్లు    4
 

ఆరెంజ్‌‌ ఆర్మీ అన్నీ గెలుస్తుందా?
భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌.. ఇండియా ఎడిషన్‌‌లో చెత్తాటతో విమర్శలు ఎదుర్కొంది. బలం అనుకున్న బౌలర్లు నిరాశ పరిస్తే.. డేవిడ్​ వార్నర్‌‌, జానీ బెయిర్‌‌స్టో, కేన్​ విలియమ్సన్‌‌ వంటి వరల్డ్‌‌ క్లాస్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ అందుబాటులో ఉన్నప్పటికీ బ్యాటింగ్‌‌లోనూ మెప్పించలేకపోయింది. అటు భారీ స్కోర్లు చేయలేక.. ఇటు చిన్న టార్గెట్లను సైతం ఛేజ్‌‌ చేయలేకపోయింది. ఫలితంగా ఏడు మ్యాచ్‌‌ల్లో  ఒకేఒక్క విక్టరీ సాధించింది. హ్యాట్రిక్‌‌ ఓటములతో లీగ్‌‌ స్టార్ట్‌‌ చేసిన ఆరెంజ్‌‌ ఆర్మీ.. పంజాబ్‌‌ కింగ్స్‌‌పై గెలిచి బోణీ కొట్టినా మళ్లీ పరాజయాల బాటలోనే పయనించింది. 7 ఇన్నింగ్స్‌‌ల్లో కలిపి 248 రన్స్‌‌ చేసిన బెయిర్‌‌స్టో ఒక్కడే ఆకట్టుకున్నాడు. వార్నర్‌‌, మనీశ్‌‌ పాండే కూడా చెరో రెండు ఫిఫ్టీలతో రాణించినా అవసరమైన టైమ్‌‌లో బ్యాట్‌‌ ఝుళిపించలేకపోయారు. వార్నర్‌‌ అయితే తన స్టయిల్‌‌కు భిన్నంగా స్లోగా ఆడటం టీమ్‌‌ను దెబ్బతీసింది. లాభం లేదని కెప్టెన్‌‌గా అతడిని తప్పించి కేన్‌‌ విలియమ్సన్‌‌కు పగ్గాలు అప్పగించినా.. రైజర్స్‌‌ ట్రాక్‌‌లో పడలేకపోయింది.  బౌలర్లు కూడా ప్రభావం చూపలేకపోయారు. అఫ్గాన్‌‌ స్పిన్నర్‌‌ రషీద్‌‌ ఖాన్‌‌ 7 మ్యాచ్‌‌ల్లో పది వికెట్లతో రాణించినా.. మిగతా వాళ్ల నుంచి సపోర్ట్‌‌ కరువైంది. ముఖ్యంగా సీనియర్‌‌ పేసర్‌‌ భువనేశ్వర్‌‌ కుమార్‌‌ స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్‌‌ చేయలేదు.  అతని ఫిట్‌‌నెస్‌‌పై ఇప్పటికీ సందేహాలున్నాయి. పైగా, టీ20 వరల్డ్‌‌ కప్‌‌ ముంగిట గాయపడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన నేపథ్యంలో ఎలాంటి రిస్క్‌‌ తీసుకునే చాన్స్‌‌ లేదు. ఇక,  సెకండ్‌‌ ఫేజ్‌‌ నుంచి జానీ బెయిర్‌‌స్టో తప్పుకోవడం రైజర్స్‌‌కు అతి పెద్ద దెబ్బ అనొచ్చు.  కాబట్టి మిగతా స్టార్లు ముఖ్యంగా వార్నర్‌‌, విలియమ్సన్‌‌, మనీశ్‌‌, రషీద్‌‌ మరింత బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో  ప్లే ఆఫ్‌‌ చేరాలంటే సన్‌‌రైజర్స్‌‌ అద్భుతం చేయాల్సిందే. ఎందుకంటే మిగిలిన ఏడు మ్యాచ్‌‌లూ గెలవాల్సిన పరిస్థితిలో ఉందా జట్టు. కనీసం ఆరింటిలో గెలిస్తేనే రేసులో ఉంటుంది. మరి, ఆరెంజ్‌‌ ఆర్మీ ఏం చేస్తుందో చూడాలి. ఫేజ్‌‌2లో తన తొలి మ్యాచ్‌‌లో రైజర్స్‌‌ ఈ నెల 22న టేబుల్‌‌ టాపర్ ఢిల్లీతో తలపడనుంది. 
ఫస్ట్‌‌ ఫేజ్‌‌లో  సన్‌‌రైజర్స్‌‌..
ఆడిన మ్యాచ్‌‌లు    7
గెలిచినవి    1
ఓడినవి    6
పాయింట్లు    2