
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఏంటంటే టిక్‌టాక్ ఇండియాలోకి మళ్ళీ వస్తుందా ? అని... దింతో చాల మందిలో ఊహాగానాలు, అంచనాలు మొదలయ్యాయి. 2020లో ఈ చైనీస్ యాప్‌ను భారత్ నిషేధించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను నిర్వహిస్తున్న చైనీస్ కంపెనీ బైట్‌డాన్స్ గురుగ్రామ్ ఆఫీసులో ఉద్యోగాల నియామకం గురించి లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసింది. దింతో ఇది చుసిన ప్రతిఒక్కరిలో టిక్‌టాక్ మళ్ళీ వస్తోందని అనుకుంటున్నారు.
టిక్‌టాక్ రావడానికి రెండు కారణాలు :
1. ఉద్యోగ ప్రకటన: TikTok పోస్ట్ చేసిన ఉద్యోగ ప్రకటనలో బెంగాలీ మాట్లాడే కంటెంట్ మోడరేటర్ పోస్ట్ ఒకటి. ఈ పోస్ట్ వీడియోలు, కంటెంట్ రివ్యూ చేయడానికి.. మరొక పోస్ట్ వెల్‌బీయింగ్ పార్టనర్‌షిప్ & ఆపరేషన్స్ లీడ్. ఈ పోస్ట్ యూజర్ సెక్యూరిటీ ఇంకా పాలసీకి సంబంధించిన పనులను పర్యవేక్షిస్తుంది.
2. వెబ్‌సైట్ యాక్సెస్: ఇంతకుముందు మీరు టిక్‌టాక్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే 'This service is not available in India' అని చూపించేది. కానీ కొద్దిరోజుల నుండి వెబ్‌సైట్ పేజీ 'About Us' అని చూపిస్తుంది. కానీ బైట్‌డాన్స్ ఉద్యోగ ప్రకటన టిక్‌టాక్ రిఎంట్రీ కోసం కాదని భారతదేశంలోని ఇతర ప్రాజెక్టులు లేదా ప్రపంచ కార్యకలాపాల కోసం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఈ వార్తల మధ్య టిక్‌టాక్‌పై నిషేధం ఇప్పటికీ ఉందని భారత ప్రభుత్వం చెబుతుంది. అలాగే టిక్‌టాక్ రిలాంచ్ పై అనుమతి ఇంకా మంజూరు కాలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతనెల ఆగస్టు 22న 5 ఏళ్ల తర్వాత టిక్‌టాక్ మళ్లీ వస్తోందన్న వార్తలపై ప్రభుత్వం కొట్టిపారేసింది. జూన్ 2020లో గల్వాన్ లోయలో భారత్ - చైనా మధ్య సైనిక ఘర్షణ తర్వాత జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ భారత ప్రభుత్వం టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్ యాప్‌లను నిషేధించింది. అప్పటి నుండి టిక్‌టాక్ భారతదేశంలో పూర్తిగా నిషేధం. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌లలో కూడా లేదు.
2016లో టిక్‌టాక్: టిక్‌టాక్ అనేది ఒక చిన్న వీడియో షేరింగ్ యాప్, దీనిలో 15 సెకన్ల నుండి 3 నిమిషాల వరకు వీడియోలను క్రియేట్ చేయవచ్చు, షేర్ చేయవచ్చు. ఇది మ్యూజిక్, డాన్స్, కామెడీ, క్రియేటివిటీ కంటెంట్‌కు ఫేమస్. టిక్‌టాక్‌ను చైనీస్ కంపెనీ బైట్‌డాన్స్ సెప్టెంబర్ 2016లో లాంచ్ చేసింది. దీనిని మొదట చైనాలో డౌయిన్ పేరుతో, తరువాత ప్రపంచ మార్కెట్ కోసం టిక్‌టాక్‌గా రీబ్రాండ్ చేసింది.