
- తల్లిదండ్రులకు ప్రభుత్వ కళాశాలల్లో సౌకర్యాల వివరణ
కామారెడ్డి, వెలుగు : ప్రభుత్వ కళాశాలల్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు పెంచేందుకు కామారెడ్డి జిల్లా యంత్రాంగం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది ఎస్సెస్సీలో 12,542 మంది పరీక్షలు రాయగా, 11,871 మంది పాసయ్యారు. ఇందులో ప్రైవేట్ స్కూల్స్ వాళ్లు 2458 మంది, మిగతా 9413 మంది జడ్పీ, గవర్నమెంట్, రెసిడెన్షియల్, కేజీబీవీల్లో చదివిన వారు ఉన్నారు. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా ఆయా మండల కేంద్రాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు.
టెన్త్ పాసైన ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ కళాశాలల్లో ఉండే సౌకర్యాలను వివరిస్తున్నారు. లెక్చరర్ల సినియార్టీ, బోధన తీరు, స్కాలర్ షిప్ సౌకర్యం వంటి వివరాలను తెలియజేస్తూ సర్కార్ కాలేజీలో చేర్పించేందుకు యత్నిస్తున్నారు. గ్రామాలకు అందుబాటులో కాలేజీ ఉంటుందని చెబుతూ కరపత్రాలు ఇస్తున్నారు. ఎస్సెస్సీ పరీక్షలకు ముందు స్కూల్స్‌కు వెళ్లి మీటింగ్‌లు నిర్వహించారు. రిజల్ట్ వచ్చిన తర్వాత పాసైన స్టూడెంట్స్‌తో, పాలిసెట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి అవగాహన కల్పించారు.
లెక్చరర్ల కొరత లేదు..
గతంలో 159 మంది జూనియర్ లెక్చరర్లు ఉండగా, 2 నెలల క్రితం భర్తీ చేసిన లెక్చరర్ల పోస్టుల్లో జిల్లాకు కొత్తగా 59 మంది వచ్చారు. ప్రస్తుతం రెగ్యులర్ లెక్చరర్లు 209 ఉన్నారు. కొత్తగా ఏర్పాటైన బీబీపేట, నాగిరెడ్డిపేట, బీర్కుర్ కాలేజీల్లో లెక్చరర్ల సంఖ్య తక్కువగాఉన్నా ఈ సారి ఆ కొరత కూడా తీరింది.
కలెక్టర్ స్పెషల్‌ఫోకస్
గవర్నమెంట్ కాలేజీల్లో ఫలితాలపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పెషల్‌ఫోకస్ పెట్టారు. స్టూడెంట్స్ రెగ్యులర్‌గా కాలేజీకి వచ్చేలా చూడాలని లెక్చరర్లకు సూచించారు. కాలేజీల వారీగా తల్లిదండ్రులు, స్టూడెంట్స్‌తో మీటింగ్‌లు నిర్వహించారు. అకాడమిక్ ఇయర్ ప్రారంభం కంటే చివరికి వచ్చే సరికి స్టూడెంట్స్ అటెండెన్స్ శాతం పెరిగింది. సీనియర్ లెక్చరర్లతో ఆన్లైన్లో నీట్, జేఈఈ మెయిన్స్ కోచింగ్ ఇప్పించారు. ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుంచే మెరుగైన విద్యాబోధన చేపట్టడంతో పాటు, జేఈఈ, నీట్ ఎగ్జామ్స్‌పై స్టూడెంట్స్‌కు కోచింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
జిల్లాలో 20 ప్రభుత్వ కాలేజీలు..
జిల్లాలో 20 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో 2,816 సీట్లు ఉన్నాయి. 2024--–25 అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో 1993, సెకండ్ ఇయర్లో 24–45 మంది విద్యార్థులు ఉన్నారు. 2023--–24 అకాడమిక్ ఇయర్ కంటే 2024-–-25 అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కలిపి మొత్తం 59 ఉన్నాయి.
అడ్మిషన్లు పెంచుతాం..
గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఈ సారి అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే లెక్చరర్లు విద్యార్థులను కలిసి కాలేజీల్లో చేరాలని వివరిస్తున్నారు. కాలేజీల్లో లెక్చరర్ల కొరత కూడా తీరింది. మెరుగైన విద్యాబోధన అందిస్తాం.
షేక్‌సలాం, ఇంటర్ నోడల్ అధికారి