
- రాత్రి పూట హైదరాబాద్‌నుంచి రావాలంటే కష్టమే
- 8.30 దాటితే జేబీఎస్నుంచి కామారెడ్డికి బస్సులు లేవ్
కామారెడ్డి, వెలుగు: రాత్రి అయ్యిందంటే హైదరాబాద్‌నుంచి కామారెడ్డికి రావడం గగనంగా మారుతోంది. రాత్రి 8.30 తర్వాత జేబీఎస్ నుంచి కామారెడ్డికి బస్సులు ఉండడంలేదు. జేబీఎస్ నుంచి కామారెడ్డి మీదుగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పలు డిపోల బస్సులు రాత్రింబవళ్లు తిరుగుతుంటాయి. అయితే అవన్నీ సూపర్‌లగ్జరీ, రాజధాని బస్సులు కావడంతో కామారెడ్డి బస్టాండ్‌కు రావడంలేదు. పట్టణంలోకి రాకుండానే హైవేపై నేరుగా వెళ్తున్నాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులు మాత్రమే కామారెడ్డి బస్టాండ్‌కు వస్తాయి. కామారెడ్డి నుంచి సికింద్రాబాద్ జేబీఎస్ వరకు నాన్‌స్టాప్ లగ్జరీ బస్సులున్నా అవి రాత్రి 8.30 గంటల వరకే అందుబాటులో ఉన్నాయి.
దీంతో రాత్రి పూట హైదరాబాద్ వెళ్లాలన్నా.. అక్కడి నుంచి తిరిగి రావాలన్నా పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది. కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల నాలుగు జిల్లాలకు చెందిన పలు మండలాల ప్రజలు ఇక్కడి నుంచే రాకపోకలు చేస్తుంటారు. వ్యాపారాలు, ఇతర పనుల మీద రోజూ వేలాది మంది ప్రయాణాలు చేస్తుంటారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ఆదిలాబాద్, నిర్మల్, బైంసా డిపోలకు చెందిన బస్సులు కామారెడ్డి మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్‌కు వెళ్తుంటాయి. గతంలో అన్ని డిపోల బస్సులు కామారెడ్డి బస్టాండుకు వచ్చేవి. లగ్జరీ, సూపర్ లగ్జరీ, రాజధాని సర్వీసుల్లో చాలావరకు నాన్‌స్టాప్‌గా మార్చడంతో టౌన్ లోపలికి రావడంలేదు. ఎక్స్‌ప్రెస్ బస్సులు మాత్రమే బస్టాండ్‌కు వస్తున్నాయి.
నిజామాబాద్, జేబీఎస్మధ్య ఇటీవల ప్రారంభించిన ఎలక్ర్టికల్ బస్సులు మొన్నటి దాక కామారెడ్డిలోపలికి వచ్చేవి. ప్రస్తుతం వాటిని కూడా నాన్‌స్టాప్‌గా మార్చారు. ఇతర డిపోలకు చెందిన నాన్ స్టాప్ బస్సులను కామారెడ్డిలో అపమని చెబుతుండడంతో ఎక్స్‌ప్రెస్ బస్సులు, మహారాష్ట్ర చెందిన బస్సుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. జేబీఎస్ నుంచి ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు బస్సులు లేక గంటల తరబడి ఆగాల్సిరావడంతో మహిళలు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. కొంతమంది వేచిఉండలేక నాన్స్టాప్బస్సుల్లో నిజామాబాద్వరకు టికెట్తీసుకుని కామారెడ్డికి 3 కిలోమీటర్ల దూరంలో బైపాస్ దగ్గర దిగుతున్నారు. ఇతర డిపోలకు చెందిన కొన్ని సర్వీసులనైనా కామారెడ్డి మీదుగా నడిపించాలని స్థానికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. కామారెడ్డి డిపో నుంచి కూడా రాత్రి 10.30 వరకు లగ్జరీ బస్సులు నడపాలని అంటున్నారు.