నలుగురు పిల్లలతో కలసి దంపతుల ఆత్మహత్య

నలుగురు పిల్లలతో కలసి దంపతుల ఆత్మహత్య
  • కర్నాటకలోని యాద్గిరి  జిల్లాలో దారుణం
  • చెరువులోకి దూకి ఆత్మహత్య.. దంపతులు, వారి నలుగురు పిల్లల మృతదేహాలు వెలికితీత

బెంగళూరు: ఏం కష్టమొచ్చిందో కాని.. ఆ దంపతులు తమ నలుగురు పిల్లలతో కలసి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం వెలుగులోకి వచ్చిన ఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాదం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన మొత్తం ఆరుగురు.. భార్యా భర్తలు.. వారి నలుగురు పిల్లలతో కలసి ఆత్మహత్యకు పాల్పడడం కర్నాటక రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది.  
కరోనా సమయంలో అనేక మంది మాదిరిగానే ఆర్ధికంగా.. కుటుంబం గడవక.. అప్పులపాలై తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో వీరు కూడా కష్టాలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం మీడియాలో రావడంతో.. నీటి కుంటలో మృతదేహాల కోసం గంటలపాటు శ్రమించిన ఫోటోలు, వీడియోలు ప్రసారం కావడం.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన జనం మృతదేహాల వెలికితీతను చూసేందుకు భారీగా తరలివచ్చారు. 
గజ ఈతగాళ్లు, స్థానికుల సహాయంతో పోలీసులు కొన్ని గంటలపాటు శ్రమించి ఆరు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. తమకున్న కొద్దిపాటి పొలం సాగు చేసుకుని జీవిస్తున్న ఈ కుటుంబం ఇంత దారుణానికి ఒడిగట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పంటలు సరిగా రాక.. దెబ్బతిని నష్టపోవడంతో అప్పుల వారికి ఎలా సమాధానం చెప్పాలోనని భయపడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. 
బార్యా భర్తలు ఇద్దరు ఆదివారం రాత్రి తమ ముగ్గురు కుమార్తెలు, కుమారుడితో కలసి గ్రామంలోని నీటి కుంట వద్దకు వచ్చి అందరూ కలసి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు కనిపిస్తోందని యాద్గిరి పోలీసులు చెబుతున్నారు. గ్రామస్తుల సహాయంతో ఆరు మృతదేహాలను వెలికితీసి శవ పరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికతో వీరి మరణానికి కారణం తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అయితే అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు.