ఖమ్మం టౌన్, వెలుగు : మున్సిపల్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పారదర్శకంగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పలు సూచనలు చేశారు. ఈ నెల 12న వార్డుల వారీగా ఫొటో ఎలక్టోరల్ జాబితాను, 13న డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాలను ప్రచురిస్తామని, అలాగే 16వ తేదీన తుది పోలింగ్ కేంద్రాల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ జిల్లాలో అందిన 192 అభ్యంతరాలలో ఇప్పటికే 129 పరిష్కరించామని, మిగిలిన వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే మున్సిపల్ ఎన్నికల విధులకు సంబంధించి గత పంచాయతీ ఎన్నికల నాటి సిబ్బంది డేటాను వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అందుబాటులో 10,345 మెట్రిక్ టన్నుల యూరియా
ఖమ్మం జిల్లాలో యాసంగి సాగు అవసరాలకు సంబంధించి సమృద్ధిగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 10,345 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రైతులకు 28,128 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని తెలిపారు. ఎరువుల పంపిణీ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
