
బీజింగ్ : చైనాలోని కిండర్ గార్టెన్ స్కూల్ వద్ద చిన్నారులపై ఓ దుండగుడు(25) కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఒకరు టీచర్, మరో ఇద్దరు పేరెంట్స్ ఉన్నారని వెల్లడించారు. ఇంకొకరికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించామన్నారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని లియాన్జియాంగ్లో సోమవారం ఈ ఘటన జరిగిందని, నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పారు. దుండగుడు పొడవాటి కత్తిపట్టుకుని స్కూల్ వైపు వెళ్తున్నట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. కత్తిపోట్లకు గురైన పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్న ఫొటోలు మీడియాలో ప్రసారం అయ్యాయి.
నిందితుడి ఇంటిపేరు వూ అని, కారు యాక్సిడెంట్చేసి తన బిడ్డను గాయపర్చిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ దారుణానికి ఒడిగట్టాడని అధికారులు తెలిపారు. మరో ఘటనలో.. గత రెండు వారాల కింద మార్షల్ ఆర్ట్స్ కోచ్ దారుణంగా కొట్టడంతో 8 ఏండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో పిల్లల భద్రతకోసం స్కూళ్ల వద్ద సెక్యూరిటీని పెంచాలని చైనా విద్యా శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు.